రొటీన్ రాజకీయాల్ని మార్చి, రొచ్చును కడిగిపారేసి, సరికొత్త పొలిటికల్ గ్రౌండ్ కోసం ప్రయత్నిస్తానన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘రూట్ స్లోగన్’! సరిగ్గా ఇదే నినాదంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన ఘనాపాటి ఎన్టీయార్. ఇదే కాక ఆశయం, ఆవేశం లాంటి మరికొన్ని విషయాల్లో వీళ్లిద్దరికీ సారూప్యతలున్నట్లు పోలిక పెట్టడం కూడా కనిపిస్తుంది. ఎన్టీయార్ బయోపిక్ తెరకెక్కి నందమూరి మీద టాక్ నడుస్తున్న ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్.. ఎన్టీయార్ మీద చేసిన సీరియస్ కామెంట్ ఒకటి పాలిటిక్స్‌ని హీటెక్కించేసింది.

జిల్లాలవారీ కోఆర్డినేటర్ల సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా వున్న పవన్ కళ్యాణ్.. తన సంకల్ప బలాన్ని ఎలివేట్ చేసుకోడానికి ఎన్టీయార్‌తో పోల్చుకున్నారు. ”ఎన్టీఆర్ గారు మెదక్‌లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుందన్నారు. కానీ.. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా తరలివచ్చారు. కానీ.. నేను తలకి ఎక్కించుకోను..” అనేశారు. ఎన్టీయార్ స్వతహాగా అహంభావి. కానీ.. దాన్ని ఆత్మవిశ్వాసంగా చెప్పుకుంటారు తెలుగు తమ్ముళ్లు.

పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్య.. తెలుగుదేశం శ్రేణుల్ని ఉడుకెత్తిస్తోంది. ఎవరు ఎక్కువ ఇగోయిస్టు.. అంటూ అప్పుడే పొలిటికల్ సోషల్ మీడియాలో చర్చ షురూ అయింది. ఎన్టీయార్ కల్వకుర్తిలో ఓడిపోతే.. చిరంజీవి సొంతూరు పాలకొల్లులో డింకీ కొట్టలేదా? అంటూ చరిత్ర పేజీలు బైటికి తీస్తున్నారు. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ మౌనంగా వుంటున్నారని, ఆయన మాటల్లో మునుపటి వాడీవేడీ కనిపించడం లేదని వైసీపీ మీడియా ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో ఎన్టీయార్ మీద కామెంట్లతో కొత్త ట్రెండ్‌కి తెర తీశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే నాగబాబు-బాలకృష్ణల మధ్య ‘నిప్పురవ్వలు’ రాజుకున్నాయి. ఆ నిప్పులో పవన్ కళ్యాణ్ ఉప్పు చల్లినట్లేనా?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *