విశాఖలో కలుద్దాం! లోకేష్ ఛాలెంజ్‌కి పవన్ రియాక్షన్!

సీఎం భాషలో అవినీతికి నిర్వచనం ఏమిటి? అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలదీశారు. అడ్డగోలుగా జరుగుతున్న మైనింగ్‌తో ఖజానాకి నష్టం చేకూర్చడంతో పాటు ప్రకృతినీ ధ్వంసం చేస్తున్నారని.. దీన్ని అవినీతి అనక ఇంకేమంటారు అంటూ ప్రశ్నించారు. రెండురోజులుగా గిరిజన ప్రాంతాల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ అక్కడ కనీస రోడ్డు సదుపాయాలు లేని విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ జిల్లా పాడేరులో జరిగిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. గూడ గ్రామంలో వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన ఒక నాయకుడు అక్రమ మైనింగ్ కోసం బాంబులు పెట్టి కొండలు పేలుస్తున్నారన్న పవన్.. అవినీతి అంటే ఇది కాదా అని సూటిగా అడిగేశారు.

ఆరోపణలు చేయడం కాదు.. సాక్ష్యాలుంటే చూపెట్టండి అంటూ పదేపదే సవాల్ చేస్తున్న మంత్రి లోకేష్‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పంచాయతీరాజ్ నిధులతో చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ కేంద్రాలకి రోడ్లు వేయించుకున్నారంటూ సీఎం కుటుంబాన్ని దెప్పిపొడిచారు. రాష్ట్రవ్యాపంగా 17 వేల కి.మీ. రోడ్లు వేశామంటున్న మంత్రి లోకేష్.. వాటిలో గిరిజన గూడేల వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. లోకేష్ నిర్వహిస్తున్న ఐటీ శాఖలో అవినీతి గురించి విశాఖపట్నంలో వివరంగా చెబుతానంటూ సస్పెన్స్‌లో ఉంచారు పవన్ కళ్యాణ్. సో.. ‘పవన్ వర్సెస్ లోకేష్’ ఎపిసోడ్ మరింత రసవత్తరం కానుందన్న మాట!