గాజువాకలో నామినేషన్ వేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేరు మార్చేశారు. పూర్తి స్థాయి రాజకీయ ఆరోపణలు సంధిస్తూ ముందుకెళ్తున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణని వెంట వెట్టుకుని.. రోడ్ షోలతో పాటు రెండుమూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి.. ఆవేశంగా ప్రసంగించారు. ‘జేడీని విశాఖ ఎంపీగా పోటీకి దింపగానే.. అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్న విజయసాయిరెడ్డి ఎందుకు గింజుకుంటున్నారు..? ఆయనకు మాగురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. అవినీతి కేసులు గుర్తు చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగిన పవన్.. వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నాడో శాంపిల్ చూపించారు.

నిజానికి.. ఈ అవినీతి కేసుల తేనెతుట్టెని మొదట కదిపింది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డే..! ‘నీకిది-నాకది థియరీ కనిపెట్టినవాడు జేడీ. అదే క్రమంలో టీడీపీ-జనసేన మధ్య ఫ్రెండ్లి పోటీకి తెర లేచింది’ అంటూ ఇటీవల ఆయన విమర్శనాత్మక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మీద విమర్శలు చేయడం విజయసాయిరెడ్డికి అలవాటే అయినా.. ఇప్పుడు లక్ష్మినారాయణను కూడా రొంపిలోకి లాగడంతో.. ఆట రక్తి కట్టడం మొదలైంది. ఇప్పుడు పవన్ దానికి కొనసాగింపునిచ్చారు.

కానీ.. సీబీఐ జేడీగా వున్నప్పుడు.. చండశాసనుడిగా కనిపించిన లక్ష్మినారాయణ.. ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చాక కూడా అదే గంభీరత పాటిస్తారా? లేక అందరిలాగే ‘లూజ్ టాక్’కి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ అక్రమాస్తుల కేసుల్ని అతిదగ్గరగా చూసిన లక్ష్మీనారాయణ.. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డిని కూడా జైలుకు పంపడంలో కీలక పాత్ర పోషించారు. నాటి విషయాలన్నింటినీ ఇక్కడ ప్రస్తావించి రాజకీయంగా లబ్ది పొందడానికి లక్ష్మినారాయణ ప్రయత్నిస్తే.. వైసీపీకి ఇరకాటం తప్పదు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *