జనసేనకు మెగా సపోర్ట్..!

క్రమంగా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిపోతున్న జనసేన కావాల్సిన జవసత్వాలన్నిటినీ కూడగట్టుకుంటోంది. పవర్‌స్టార్‌గా తనకున్న అభిమాన గణాన్ని జనసైనికులుగా మార్చుకునే పనిలో బిజీగా వున్నారు పవన్ కళ్యాణ్. కానీ.. సొంత కుటుంబం నుంచే అతడికి ఆసరా దొరుకుతుందా అనే సందేహాలు గత రెండేళ్లుగా మొదలయ్యాయి. పెద్దన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతుండడంతో జనసేనకు బహిరంగ మద్దతిచ్చే అవకాశం లేకపోయింది. కానీ.. రాజ్యసభ మెంబర్‌షిప్ ముగిసిపోవడంతో ప్రజాజీవితానికి దాదాపు దూరంగానే ఉండిపోయారు చిరంజీవి. ఆయన తర్వాతి స్టెప్ ఏమిటన్న సస్పెన్స్ కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేనలోకి స్వామినాయుడు ఎంట్రీ అంటూ వెలువడ్డ బ్రేకింగ్ న్యూస్ ఆసక్తిని రేపుతోంది. గతంలో ఈయన ఏపీ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండేవారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇప్పుడా పదవికి రాజీనామా చేసి.. చిరంజీవి ఆశీస్సులు తీసుకుని ఈనెల 9న జనసేనలో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో.. చిరంజీవి ట్రెడిషనల్ ఫాన్ ఫాలోయింగ్ జనసేన ఖాతాలోకి జమయ్యేందుకు రూట్ పడినట్లేనని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లున్న చిరంజీవి కూడా తమ్ముడికి రేపటిరోజున బహిరంగ మద్దతు తెలిపినా ఆశ్చర్యం లేదు.