జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొద్దికొద్దిగా ట్రెడిషనల్ పొలిటీషియన్‌గా మారిపోతున్నారు. మూస రాజకీయాలకు, మోసపూరిత రాజకీయాలకు భిన్నంగా సరికొత్త నిఖార్సయిన రాజకీయాలు చేస్తానంటూ మొన్నటివరకూ గట్టిగా చెప్పిన పవన్.. తప్పనిసరి పరిస్థితిలో తానూ ‘దొడ్డిదారి’ పట్టేస్తున్నారు. విజయవాడ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్ని మరోసారి కెలికేశాయి. ‘నాకు బలం లేదంటారు. మళ్ళీ నాతో పొత్తు కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తారు. మనుషుల్ని పంపి రాయబారం చేస్తున్నారు..’ అన్నప్పుడు పవన్ కళ్యాణ్‌లో పొలిటికల్ మెచ్యూరిటీ స్పష్టంగా కనిపించింది.

రాజకీయాల్లో ముక్కుసూటితనం కంటే.. వ్యూహాత్మక ఎత్తుగడలే బాగా వర్కవుట్ అవుతాయన్న జ్ఞానోదయం పవన్‌కి ఇప్పుడిప్పుడే అవుతోంది. ‘బాబు మార్క్ పాలిటిక్స్’ని అడాప్ట్ చేసుకోవడం ఇక్కడ ఆసక్తికరం. ‘జనసేన కలిసొస్తామంటే మీరొప్పుకుంటారా?’ అని మీడియాతో ప్రశ్నలేయించుకుని.. ముందే ప్రిపేర్ చేసుకున్న ఆన్సర్‌ని బైటికొదిలి.. చంద్రబాబు ఇటీవల తెలివితేటలు ప్రదర్శించారు. జనసేనలో ఎంతోకొంత అలజడి సృష్టించాలన్నదే బాబు ఎత్తుగడని అందరూ విశ్లేషించారు. తర్వాత.. పవన్ కల్యాణే ముందుకొచ్చి ‘పొత్తులాట’పై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

అప్పుడు చంద్రబాబు తనమీద వేసిన పాచికనే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ మీద వేశాడా? అనేది అసలు సందేహం. ‘మాకు ఎవ్వరితోనూ పొత్తు అక్కర్లేదు.. ఒంటరిగా పోటీ చేస్తాం’ అంటూ ఇప్పటికే విస్పష్ట ప్రకటన చేసిన జగన్ శిబిరాన్ని గందరగోళ పరచడమే పవన్ స్ట్రాటజీ. ఈసారి ఆరునూరైనా బులెట్ మిస్ కాకూడదన్న కసితో పనిచేస్తున్న జగన్.. అవసరమైతే జనసేనను కలుపుకుందామన్న ప్రపోజల్‌ని పరిశీలిస్తున్నారని వైసీపీలో కొన్నాళ్లుగా చెప్పుకున్నారు. ఇప్పుడు ‘నా దగ్గరకు వైసీపీ రాయబారులొచ్చారు’ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో.. ఆ ఊహలకు తాజాగా రెక్కలు తొడిగినట్లయింది.

చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్‌కి జడుసుకుని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకున్నట్లే.. ఇప్పుడు వైసీపీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. సీనియర్ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ‘మళ్ళీ చెబుతున్నాం.. మాకు ఎవ్వరితోనూ పొత్తులొద్దు. పవన్ కళ్యాణ్‌తో అయితే అసలే వద్దు. తనవద్దకొచ్చి మాట్లాడిన వైసీపీ నాయకులెవరో పవన్ చెప్పాలి’ అంటూ రివర్స్ ఛాలెంజ్ విసిరారు పార్థసారథి. ఈ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ ఆడింది అబద్ధమా.. కాదా.. ఒకవేళ అబద్ధమే అయితే అది ఎంతవరకు అతికింది.. అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా నడుస్తోంది. ఏదేమైనా.. పవన్ ‘కాంటెంపరరీ పొలిటికల్ సైన్స్’ని బాగానే వంటబట్టించుకున్నారు.. షార్ట్ కట్స్ వెతుక్కుంటూ దూసుకెళ్తున్నారు.. అనేది జనసేన క్యాడర్ సంబరం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *