ప్లాస్టిక్ వాడకం మనుషులకు హానికరం కాకపోయినా..జంతువులూ, జలచరాల ప్రాణాల మీదికి తెస్తోంది. సముద్ర బీచుల్లో వాడి పారేసిన ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులు వీటి పాలిట అత్యంత ప్రమాదకారిగా మారుతున్నాయి.

దక్షిణాఫ్రికా లోని స్ట్రూస్ బాయ్ అనే టౌన్ లో గల వెటర్నరీ కేంద్రానికి ఈ మధ్య కొందరు వ్యక్తులు కదలలేక అనారోగ్యంతో ఉన్న ఓ సముద్రపు తాబేలును తీసుకువచ్చారు. దానికి ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేక అది రోజురోజుకీ చిక్కి శల్యమవుతూ వచ్చింది. దీంతో వెటర్నరీ డాక్టర్లు ఆ తాబేలుకు శస్త్ర చికిత్స చేశారు. చూస్తే ఏముంది ? ఆ తాబేలు గొంతులో ఓ నల్లని ప్లాస్టిక్ కవర్ లాంటిది కనిపించింది. దాన్ని వెంటనే తొలగించినా ఆ తాబేలు కోలుకోలేకపోయింది. ప్లాస్టిక్ వల్ల సముద్ర జీవులు క్రమేపీ అంతరించిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు జంతు నిపుణులు.

ప్రతి ఏడాదీ మనుషులు సుమారు 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వస్తువులను వృధాగా సముద్రాల్లో పారవేస్తున్నారు. వీటిని ఆహారంగా భావించిన జలచరాలు వీటిని మింగి ముప్పును కొని తెచ్చుకుంటున్నాయి. కొన్ని ప్లాస్టిక్ బ్యాగులు తాబేళ్ళకు సహజమైన సముద్రపు నాచులా, ఇతర మొక్కల్లా ఉండడంతో అవి వాటిని మింగుతున్నాయని, ఇండోనేషియాలో చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపు నుంచి కొన్ని వందల టన్నుల ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులు బయటపడడం తెలిసిందేనని అంటున్నారు. ఆవులు, గేదెలు వంటి జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ పట్ల ఆకర్షితమై వీటిని తింటూ అనారోగ్యం బారిన పడుతున్నాయి. అందువల్లే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *