ఫ్రాన్స్ సంబరాల్లో రెచ్చిపోయిన అభిమానులు.. పోలీసులతో ఘర్షణలు

ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తో నెగ్గి విశ్వ విజేతగా నిలవడంతో అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి. పారిస్ వీధుల్లోకి వచ్చి వారు సంబరాలు చేసుకున్నారు.

లక్షలాది మంది రోడ్లపైకి దూసుకువచ్చారు. తమ జట్టు విజయానికి సూచికగా వేలమంది రోడ్డుపై పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు ఎక్కి నినాదాలు చేశారు. కొందరు పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తే మరికొందరు ఇదే అదనని షాపులపై లూటీలకు పాల్పడ్డారు.

వీరిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించి, వాటర్ క్యాన్‌లు ఉపయోగించారు. సంతోషం కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళురువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు.

అభిమానులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసి..ముందు జాగ్రత్త చర్యగా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు.

కాగా తమ జట్టు గెలించిందన్న ఆనందం పట్టలేక ఒకరు కెనాల్ పైనుంచి దూకి గాయపడి మరణించాడు. మరొకరు మితి మీరిన వేగంతో కారు నడుపుతూ చెట్టుకు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.

అటు- తమ జట్టు కోచ్ దిదియెర్ డెస్చాంప్  ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయగా.. ఆయన మాట్లాడడానికి ముందే.. ఫ్రాన్స్ ఆటగాళ్ళు ఒక్కసారిగా వేదికపైకి దూసుకువచ్చి.. షాంపేన్ చల్లుతూ ఆనందోత్సాహాలతో గెంతులు వేశారు. ఆయనను అభినందనలతో ముంచెత్తారు.