‘ఈ 36 గంటలే కీలకం’ కనుక.. అటు ఎన్నికల అధికారులు, ఇటు అభ్యర్థులు టామ్ జెర్రీ గేమ్ ఆడేస్తున్నారు. ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ ‘పంపకాల జోరు’ కొనసాగుతుంటే.. పోలీసుల చేతులకు బాగా పని దొరుకుతోంది. ఆకాశరామన్నలందించే ఫిర్యాదుల్ని పట్టుకుని అనుమానం వచ్చిన అందరి ఇళ్ల మీద ఆకస్మిక దాడులు షురూ చేస్తున్నారు.
ఈ ఒరవడిలోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏదీ లేకపోయినప్పటికీ.. సీనియర్ కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు స్టేట్మెంట్ ప్రకారం.. దాదాపు 50 మంది పోలీసులు హుజూర్ నగర్లోని ఉత్తమ్ ఇంటిపై దాడి చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని వీహెచ్ ఆరోపిస్తున్నారు. వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల కొనుగోలు కోసం తరలిపోతున్న రూ. 135 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు. గత ఎన్నికల కంటే ఇది రెండింతలు. మొత్తం 250 కేసులు నమోదయ్యాయి.