చంపెయ్యండి.. ప్రకాష్ రాజ్‌తో పాటు మరో 36 మందిని..!

అవును.. వాడి హిట్‌లిస్ట్ అంత భయపెట్టేదిగానే వుంది. దేశంలో ప్రశ్నించే వాడెవ్వడూ బతికుండకూడదన్నదే వాళ్ళ లక్ష్యమట! కన్నడ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసును తవ్వి తీస్తున్న సిట్ పోలీసులు చెబుతున్న తాజా బ్రేకింగ్ న్యూస్ ఇది! గతేడాది సెప్టెంబర్‌ 5న బైకుపై వచ్చిన దుండగులు గౌరీలంకేశ్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చిన విషయం ఇప్పుడు.. దేశ రాజకీయ రంగునే మార్చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన అనుమానితుడు అమోల్ కలేని విచారిస్తున్నకొద్దీ విస్తుగొలిపే విషయాలు బైటికొస్తున్నాయి.

గౌరీ లంకేశ్‌ని చంపిన తుపాకీతోనే.. అంతకుముందు మానవతావాది కల్బుర్గిని కాల్చినట్లు మొన్నీమధ్యే తేల్చేశారు పోలీసులు. నటులు గిరీష్ కర్నాడ్, ప్రకాష్ రాజ్‌ల మీద కూడా వీళ్ళ తుపాకీ గురి పెట్టిందన్న వార్త కూడా వినపడింది. ఇప్పుడు ‘హంతకుడు’ అమోల్ దగ్గర దొరికిన డైరీని, అందులోని కోడ్ భాషనీ ఛేదించిన తర్వాత.. సిట్ పోలీసులకే చెమటలు పట్టేశాయట! గౌరీ లంకేశ్‌తో పాటు మరో 36 మంది ప్రముఖుల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ డైరీలో రాసిందని సిట్ చెబుతోంది. ఈ మొత్తం ఆపరేషన్‌ పూర్తి చేయడానికి 50 మంది హార్డ్ కోర్ హిందుత్వవాదుల్ని పురమాయించి.. వాళ్లకు ఫైరింగ్‌లో తర్ఫీదు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం 36 మందిలో పది మంది కర్ణాటకవారే వున్నారంటున్న పోలీసులు, భద్రతా కారణాల దృష్ట్యా మిగతా పేర్లు ఇప్పుడే చెప్పలేమంటున్నారు.