విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. రాజకీయాల్లో కూడా విలక్షంగా.. రొటీన్ పార్టీలకు భిన్నంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. అది ప్రాక్టికల్‌గా సానుకూల ఫలితాలనిచ్చే పరిస్థితులు కనబడకపోవడంతో.. మళ్ళీ యూటర్న్ తీసుకుంటారని, ట్రెడిషనల్ పొలిటికల్ ట్రెండ్ వైపే మొగ్గుచూపుతారని వార్తలొస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలన్న తన అభిమతానికి విరుద్ధంగా పడ్తున్నాయి ప్రకాష్ రాజ్ తాజా అడుగులు. ‘జస్ట్ అస్కింగ్’ పేరుతో వున్న తన ట్విట్టర్ ఖాతాకు రాజకీయ రంగు పులిమేసుకున్నారు. పార్లమెంట్ మెట్లెక్కడం ఖాయమన్న ధీమాతో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఇంతకీ ఏమిటతడి ధీమా?

బెంగళూరు సెంట్రల్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన మరునిమిషం నుంచి కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్నారు ప్రకాష్ రాజ్. భావసారూప్యత పేరుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కలిసి మద్దతు కోరి సరేననిపించుకున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీకున్న 40 వేల ఓటుబ్యాంకును ఆ విధంగా చేజిక్కించుకున్నారు. కానీ.. కేజ్రీవాల్‌కీ, కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ రాష్ట్రంలో పొత్తు కుదిరి సీట్ల పంపకాలు కూడా ముగిసిపోయాయి.

మోదీ తీరును, బీజేపీ మోరల్ పోలీసింగ్‌ని మొదటినుంచీ విమర్శిస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్.. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి నైతికంగా దగ్గరయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ సర్కారు నడుపుతున్న కుమారస్వామితో ప్రకాష్‌రాజ్‌కి చిరకాల స్నేహం ఉండనే వుంది. పదేళ్ల నుంచి బీజేపీ కంచుకోటగా వున్న బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా నెగ్గుకురావడమంటే మాటలు కాదని, దీనికి ప్రధాన పార్టీల అండదండలుండాల్సిందేనని సన్నిహితులు చెప్పడంతో.. ప్రకాష్ రాజ్ ఆ మేరకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు.

తాజాగా ‘నిర్మలా సీతారామన్-రాహుల్ గాంధీ’ వివాదంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్.. రాజకీయ ఆసక్తిని రేపుతోంది. పార్టీ కీలక పదవిలో ట్రాన్స్‌జెండర్‌ని కూర్చోబెట్టిన రాహుల్‌గాంధీకి మహిళల పట్ల మర్యాద లేదని ఎలా ఫిక్స్ అవుతారన్నది ప్రకాష్ రాజ్ ప్రశ్న. రాహుల్ వ్యాఖ్యల్ని వన్ సైడెడ్‌గా తీసుకోవద్దన్న ప్రకాష్ రాజ్ మాటల అంతరార్థం మీద కన్నడ పాలిటిక్స్‌లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరి.. జేడీఎస్ పొత్తుతో బెంగళూరు సెంట్రల్‌ని చేజిక్కించుకోడానికి ఈ మోనార్క్ స్కెచ్ గీసుకున్నట్లు అక్కడి మీడియా రాసేసింది. ఎన్నికలకు ఇంకా సమయం వుంది కనుక.. ఈలోగా ప్రకాష్ రాజ్‌కి.. కాంగ్రెస్ పార్టీకి.. లగ్గం కుదిరినా కుదరొచ్చట!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *