స్వామి కార్యం.. స్వకార్యం.. అదీ బాహుబలి స్ట్రాటజీ!

బాహుబలి విత్ బాహుబలి..! కర్ణాటకలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రావణబెళగోళలో బాహుబలి గోమటేశ్వరుడికి జరిగిన మహా మస్తకాభిషేకంలో బీజేపీ బాహుబలి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అరుదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. కన్నడిగులకు మంచి సెంటిమెంట్ కూడా! త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో.. ఇటువంటి మహా క్రతువు నిర్వహించడం.. దానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం.. రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇంతటి మెగా ఈవెంట్ కి కేంద్ర బడ్జెట్లో కనీస కేటాయింపులు కూడా జరగలేదని, ఈ విషయమై మోదీని నిలదీస్తామని ఇప్పటికే కన్నడ కాంగ్రెస్ శ్రేణులు మంట మీదున్నాయి. కానీ.. ఈ సందర్భాన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకున్నారు ప్రధాని మోదీ. మస్తకాభిషేకం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన బడ్జెట్ కేంద్రంగానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘మోదీ కేర్’ అనే ఆరోగ్య బీమా పథకాన్ని మోదీ ఎక్స్ పోజ్ చేసుకున్నారు. మనిషికి ఆరోగ్యం ముఖ్యమని, శారీరక, మానసిక సౌష్టవంతోనే ఏదైనా సాధించగలమని, ‘బాహుబలి’ పరమ సూత్రం కూడా అదేనని వివరించారు ప్రధాని మోదీ. ‘మోదీ కేర్’ పథకాన్ని, గోమటేశ్వర సిద్ధాంతాన్ని కలిపి.. జనంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి ప్రయత్నించిన మోదీ.. అటు స్వామి కార్యం.. ఇటు స్వకార్యం.. రెండింటినీ ఒకేసారి కానిచ్చుకున్నారు.