సినిమా పేరు: లవర్స్‌ డే

న‌టీన‌టులు: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌.. అండ్ అదర్స్
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
నిర్మాత‌లు : ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి
బ్యానర్ : సుఖీభవ సినిమాస్
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

పరిచయం : కన్నుగీటి కుర్రకారు మొత్తాన్ని ఒక ఊపు మోపిన వింక్ గాళ్ ప్రియవారియర్.. ‘ఇప్పుడే ఏమైంది అసలు కథ ముందుంది’ అంటూ తన మూవీ ‘ఒరు అదార్ లవ్’ని బాగా ప్రమోట్ చేసుకుంది. ఎన్నోరోజులుగా ఊరించి ఊరించి.. ఆ సినిమా ఇప్పటికి థియేటర్లకొచ్చింది. వేలంటైన్స్ డే సందర్భంగా ‘లవర్స్ డే’ పేరుతో తెలుగు వెర్షన్ విడుదలైంది. కన్నుగీటడం ద్వారా ప్రియా సృష్టించిన సునామీని ఈ సినిమా కంటిన్యూ చేసిందా? లేక ఉస్సూరమనిపించిందా? తెలుగు ప్రేక్షకుడికి దగ్గర కావాలన్న ప్రియా వారియర్ కలల్ని ఈ సినిమా నిజం చేస్తుందా?

కథేంటి? : రోష‌న్ (రోష‌న్‌), ప్రియా (ప్రియా వారియ‌ర్‌).. మరో ముగ్గురు గాథ జాన్, మాథ్యూ, ప‌వ‌న్.. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్! మంచి థిక్ ఫ్రెండ్స్‌గా కలిసే వుండే ఈ నలుగురిదీ ఒకటే క్లాస్ రూమ్. తొలి చూపులోనే రోష‌న్‌, ప్రియా ప్రేమ‌లో ప‌డ‌తాడు. మొగ్గ తొడిగిన వీళ్ళ ప్రేమ మరింత ముదరడానికి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోని గాధ అనే అమ్మాయి తోడ్పడుతుంది. కానీ.. వాట్సాప్ గ్రూప్‌లోని కొన్ని వీడియోల కారణంగా ఇద్దరి మధ్య తేడాలొస్తాయి. గ్యాప్ బాగా పెరిగిపోతుంది. దీంతో నొచ్చుకున్న మిగతా ఫ్రెండ్స్ రోషన్-ప్రియల మధ్య ప్యాచ్‌అప్ కోసం ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఒక చిన్న డ్రామా ప్లాన్ చేస్తే.. అది కాస్తా ట్రయాంగిల్ లవ్‌గా మారి.. మరింత చిక్కుముడి పడుతుంది. అదెలా వీడుతుంది.. చివరికి వీళ్లిద్దరి ప్రేమ ఫలిస్తుందా? లేక అడ్డం తిరుగుతుందా? అనేది ‘లవర్స్ డే’ మూవీలో కీలకం!

ఎలా తీశారు? : నూనూగు మీసాల వయసు ప్రేమ కథలు తెలుగు తెరకు కొత్త కాదు. అలాగే.. కాలేజ్ నేపథ్యంతో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ చాలానే చూశాం. ‘హ్యాపీ డేస్’ లాంటి ఫక్తు స్టూడెంట్ లవ్ థీమ్‌ని టేస్ట్ చేసిన తెలుగు ఆడియెన్స్ ‘పల్స్’ని మరోసారి పరిశీలించడానికి ప్రియావారియర్ ‘లవర్స్ డే’ ప్రయత్నించింది. క్లాస్ రూమ్ హ్యూమర్, క్యాంపస్ టాక్, లవ్ సీక్వెన్స్ ల చుట్టూ తిరుగుతూ ఫస్టాఫ్ ముగించినప్పటికీ.. డైరెక్టర్ ఒమ‌ర్ లులు కొత్తదనం ఏదీ చూపించలేకపోయారు. ఫ్రెషర్స్ డే, యాన్యువల్ డే సన్నివేశాల మీద చేసిన కాన్సంట్రేషన్ వృధా ప్రయాసేననిపించింది. స్టూడెంట్స్-లెక్చరర్చ్ మధ్య కామెడీ ట్రాక్ పేలవంగా సాగింది. ప్రేమకథలకు గుండెకాయ లాంటి ఎమోషన్స్.. ఇందులో పండిన దాఖలా ఎక్కడా లేదు. అటు.. సెకండాఫ్ మీద ఆసక్తిని రేకెత్తించేలా ఫస్టాఫ్ డిజైన్ చేసుకోలేకపోయాడనే చెప్పాలి. ఇద్దరి మధ్య బ్రేకప్ సీన్లు, మళ్ళీ ప్రేమలో పడ్డం, వీళ్ళ మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం లాంటివన్నీ సెకండాఫ్‌లోనే దట్టించి.. కథలో స్పీడ్ పెంచగలిగాడు. క్లయిమాక్స్ కొచ్చేసరికి మరింత పట్టు దొరికినట్లనిపించింది. అంతవరకూ ఊహకే అందని పతాక సన్నివేశాల్ని పెట్టడంతో.. ఫస్టాఫ్‌లో స్టఫ్ లేదన్న వెలితిని ప్రేక్షకుడు మర్చిపోతాడు.

ఎలా చేశారు? : హీరోహీరోయిన్లు రోష‌న్‌, ప్రియాలకు దీటుగా వీళ్లిద్దరి మధ్య మరో అమ్మాయిగా వచ్చిన నూరిన్ షెరిఫ్ పాత్ర కూడా ఇందులో కీలకం. క‌న్నుకొట్టే స‌న్నివేశంతో పాపుల‌ర్ కావడంతో ప్రియా పెర్ఫామెన్స్ మీదనే ప్రేక్షకుడి దృష్టి నిలబడుతుంది. కానీ.. అంచనాలకు తగ్గట్టు ప్రియా నటించలేకపోయింది. స్టోరీలో తన పాత్ర నిడివిని అసంబద్ధంగా పెంచినట్లు తోచింది. మరో క‌థానాయిక నూరిన్ షెరిఫ్.. కొన్ని సీన్లలో ప్రియా కంటే అందంగా కనిపిస్తుంది. హీరోయిన్ రోల్‌ని డామినేట్ చేసిందనే చెప్పొచ్చు. ఇంటర్ కుర్రాడి పాత్రలో రోష‌న్ అతకలేదన్న ఫీల్ కలిగింది. ఎప్పుడూ నవ్వు మొహంతోనే ఉండడంతో.. మిగతా భావాల వ్యక్తీకరణ దగ్గర శాటిస్ఫై చేయలేకపోయాడు. సాంకేతిక విలువల విషయంలో ఫర్వాలేదనిపించింది. డబ్బింగ్ క్వాలిటీ అత్యంత పేలవంగా ఉందని, కార్టూన్లకు మాటలు చెప్పినట్లుందని, లిప్ సింక్ దగ్గర కనీస జాగ్రత్తలు పాటించలేదని చెప్పొచ్చు.  మొత్తమ్మీద పెర్ఫామెన్స్ పరంగా, కథ-కథనం పరంగా సినిమాలో ఆశించినంత నాణ్యత లేదు. క్లాస్‌రూమ్‌లో కన్నుకొట్టే ఆ ఒక్క సీన్.. సినిమాకు బలమూ-బలహీనత కూడా! విపరీతమైన హైప్ రావడమే ‘లవర్స్ డే’కు శాపం కావొచ్చు

ఆఖరి మాట : ‘హ్యాపీ డేస్’ చూడనివాళ్లకు ఓకే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *