ప్రొఫెసర్ కోదండరాం..! తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్‌కి సమాంతరంగా పోరాడిన కీలక శక్తిమంతుడు. రాజకీయాల్లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకుందామని ‘తెలంగాణ జన సమితి’ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలతో కలిసి పొత్తు పెట్టుకుని మహాకూటమి తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టారు. కానీ.. ఫలితాలు వెల్లడయ్యేసరికి ప్రొఫెసర్ గారి పార్టీ సోయిలో కూడా లేకుండా పోయింది. కూటమి మొత్తం చెల్లాచెదరైంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు ‘నై’ చెప్పి ఒంటరి పోరుకే దిగేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కానీ.. కొన్ని కీలక ఎంపీ సెగ్మెంట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఏర్పడింది.

తెలంగాణ హాట్ సెంగెంట్స్‌లో నిజామాబాద్ ఒకటి. కేసీఆర్ కూతురు కవితమ్మ.. మధుయాష్కీ గౌడ్‌ని ఓడగొట్టి పార్లమెంట్లో ఎంట్రీ ఇచ్చింది ఈ నిజామాబాద్ నుంచే. దాదాపు లక్షా 50 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో కవితను ఢిల్లీకి పంపాడు నిజామాబాద్ ఓటరు. 2019లో కూడా ఇక్కడినుంచే పోటీ చేసే ఉద్దేశంతో ఆమె స్థానికంగా బలం పెంచుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విస్తృతంగా తిరిగి, కష్టపడి తెరాస అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు కల్వకుంట్ల కవిత. ఈ క్రమంలో చిన్నమ్మ తాకిడిని తట్టుకోవాలంటే.. కాంగ్రెస్ పార్టీకి మరింత బలమైన అభ్యర్థి కావాల్సి వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం కోసం కాంగ్రెస్ పార్టీ గాలమేసినట్లు తెలుస్తోంది.

మహా కూటమికి మెంటర్‌గా బాగా ప్రచారం పొందినప్పటికీ, కనీసం తన సీటు (జనగాం)ను కూడా కాంగ్రెస్ చేతుల్లోంచి దక్కించుకోలేక.. చివరికి ఫలితాల్లో కూడా చతికిలబడ్డం.. ప్రొఫెసర్ గార్ని బాగా కుంగదీసింది. మొహం చెల్లక ఆయన జనంలోకి రావడమే మానేశారు. డిసెంబర్ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒకానొక సందర్భంలో మళ్ళీ తెరాస వైపు చూస్తున్నారన్న వార్తలొచ్చాయి. ఇప్పుడు సొంతపార్టీ (టీజేఎస్) తరఫున నిజామాబాద్ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ బంపరాఫర్‌ని ప్రొఫెసర్ వదులుకుంటారా? లేక వేరేదైనా ‘దారి’ చూసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా మారింది. సిట్టింగ్ ఎంపీ కవిత మాత్రం.. ప్రొఫెసర్ సారుతో ఢీకొట్టడానికి సైతం రెడీ అంటూ సవాల్ చేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *