పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాకిస్థాన్ పౌరుడు, జైషే సభ్యుడు కమ్రాన్‌ను సూత్రధారిగా గుర్తించిన అధికారులు, ఆత్మాహుతి దాడి కోసం భారీగా హైగ్రేడ్ ఆర్‌డీఎక్స్ వాడినట్లు దర్యాప్తులో తేలింది. పేలుగు తర్వాత బస్సు అవశేషాలు నల్లగా మారడంతో ఐఈడీ ఉపయోగించలేదని నిర్ధారించిన అధికారులు, సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న 78 వాహనాల్లో ప్రమాదానికి గురైన బస్సు ఐదో స్థానంలో వుంది. అందులో 16 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలున్నాయి. ఆత్మాహుతి దాడికి కారణమైన పేలుడు పదార్ధాలున్న కారు.. రోడ్డుపై దూసుకురావడంతో గస్తీ బృందాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. జాతీయ రహదారిపై ప్రయాణించిన ఆత్మాహుతి దళసభ్యుడు 76వ బెటాలియన్ కాన్వాయ్ కు సమాంతరంగా వెళ్లి దాడికి పాల్పడినట్టు తేలింది. మూడు దశాబ్దాలుగా ఇంత భారీస్థాయి దాడి జరగలేదని, ఆర్డీఎక్స్‌ను వినియోగించడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 2008లో అసోంలో వినియోగించారు.

80 కేజీల పేలుడు పదార్ధాలను పాకిస్థాన్ నుంచి కొద్దికొద్దిగా తెచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పుల్వామా, అవంతిపుర ప్రాంతాల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ నిఫుణులతో కలిసి ఆధారాలు సేకరించింది ఎన్ఐఏ టీమ్. కాశ్మీర్‌లో 19 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడికి కమ్రాన్ సూత్రధారి కాగా, త్రాల్ జిల్లాలోని మిదూర ప్రాంతంలో దీనికి ప్లాన్ చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనతో ఇప్పటివరకు బలగాల తరలింపునకు అనుసరిస్తున్న విధానం మారనుంది. సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించే బస్సుల్లో అదనపు భద్రత ఏర్పాటు చేయనున్నారు. జవాన్లు కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇబ్బంది కలిగినా ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నట్లు కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *