జమ్మూకాశ్మీర్‌లో పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ పక్కాగా ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఏకాకి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది మోదీ సర్కార్. ముఖ్యంగా పాక్‌ని ఆర్థికంగా కోలుకోకుండా దెబ్బతీసేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పాక్‌కి కల్పిస్తున్న అత్యంత ప్రాధాన్య దేశం (మోస్ట్ ఫేవర్డ్ నేషన్-ఎంఎఫ్‌ఎన్) హోదాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనివల్ల భారత్‌కి లాభమేంటి? నష్టమేంటి? లోతుల్లోకి వెళ్తే…

ఎంఎఫ్ఎన్ హోదా అంటే ఏమిటి?

ప్రపంచ వాణిజ్య సంస్థ- డబ్ల్యూటీవో ఒప్పందం ప్రకారం.. అందులో సభ్య దేశాలు ఎమ్‌ఎఫ్‌ఎన్ హోదా కల్పిస్తాయి. భారత్, పాక్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1996లో పాక్‌కు భారత్ ఎమ్‌ఎఫ్‌ఎన్ హోదా కల్పించింది. కస్టమ్స్ సుంకాలు, ఇతర పన్నుల విషయంలో సభ్య దేశాలపై వివక్ష చూపడానికి వీల్లేదు.

సిమెంట్, పెట్రోలియం ప్రొడక్ట్స్, కొన్ని బల్క్ మెటీరియల్స్, లెదర్ వంటివి పాక్ నుంచి భారత్ కి ఎగుమతి అవుతుంటాయి. మన దేశం నుంచి పాక్‌‌కు పండ్లు, పత్తి, కెమికల్స్, ప్లాస్టిక్, ఇనుము, ఉక్కులాంటివి ఎగుమతి చేస్తోంది. ఉగ్రదాడుల నేపథ్యంలో ఎమ్‌ఎఫ్‌ఎన్ జాబితా నుంచి పాక్‌ను తొలగించింది భారత్. హోదాను ఉపసంహరించుకోవడంవల్ల ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలను పెంచవచ్చు. హోదా రద్దు వల్ల ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. అక్కడి పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

లాభమేంటి?

2017-18 లో మన దేశం నుంచి పాక్‌కు 1.92 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా.. పాక్‌ నుంచి భారత్‌కు 488.5 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. హోదా ఆపి, దిగుమతి సుంకాలు భారత్ పెంచడం వల్ల 488 మిలియన్ డాలర్ల వస్తువులపై ప్రభావం పడనుంది. ఈ పరిణామం రెండుదేశాల మధ్య అక్రమ వాణిజ్యానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నమాట. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్ర దేశాలపై ఈ తరహా ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సింధు జలాలపై ఫోకస్?

ఎంఎన్ఎఫ్ హోదా తర్వాత పాక్ వైఖరిలో మార్పు రాకుంటే.. సింధు జలాలపై ఫోకస్ చేయాలని మోదీ సర్కార్ ఆలోచన చేస్తోంది. టిబెట్‌లో పుట్టిన సింధునది.. జమ్మూకాశ్మీర్ మీదుగా పాక్‌కి ప్రవహిస్తుంది. ఇందులో పాక్ 80 శాతం, ఇండియా 20 శాతం నీటిని ఉపయోగించుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య 1960ల్లో సింధు న‌దీ జ‌లాల ఒప్పందం కుదిరింది. డీల్ ప్రకారం.. బియాస్, రావి, సట్లేజ్ నదులపై భారత్‌కు హక్కులుండగా, జమ్మూకాశ్మీర్‌ నుంచి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాక్‌కు హక్కులుంటాయి. భారత్ కనుక ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే.. ఈ జ‌లాల‌పై 80 శాతం ఆధారపడుతున్న పాక్‌కు విద్యుత్తు అవసరాలు, త్రాగు నీరు, ల‌క్షలాది ఎక‌రాల భూములకు నీళ్లు అందవు. ఫలితంగా పాక్ ఎడారిగా మారే అవకాశాలుంటాయి.

తాజాగా కాశ్మీర్‌లో జరిగిన దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈ విషయంలో అమెరికా ఓ అడుగు ముందుకేసి పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. పాక్ భూభాగంలో ఉగ్రవాదులకు వెంటనే మద్దతు ఆపేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో తమ దేశ పౌరులు పాక్‌లో పర్యటించవద్దని హెచ్చరికలు జారీ చేసింది అమెరికా. ప్రపంచ దేశాల సహాయంతో పాక్‌పై ఒత్తిడి తెచ్చి ఉగ్ర దాడులకు బ్రేక్ వేయాలని ప్లాన్ చేస్తోంది భారత్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *