తప్పుడు ప్రచారం ఆపండి: పురందేశ్వరి

కేంద్రంపై చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపాలన్నారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. కేంద్రం ఏపీకి ఎంతో సాయం చేస్తున్నా కావాలనే కేంద్రాన్ని బూచీగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వానికి చురకలంటించారు. 2014 -15 సంవత్సర ఆర్థిక లోటు ఒక్కటి తప్పించి చేయాల్సిన సహాయాలన్నీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చేసిందని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏనాడైనా సాయం చేయనని చెప్పిందా అనే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఒక్క ఐఐటీని రంగారెడ్డిజిల్లాకు తీసుకురావడానికి నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డానని చెప్పిన ఆమె, ఐఐటీ, ఎయిమ్స్ వంటి 11 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను కేంద్రం ఏపీకి ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గ్రామాల్లో రోడ్లు, గృహనిర్మాణాలు.. చంద్రన్న బీమా యోజనలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉందని ఆమె చెప్పారు. విభజన చట్టంలోని అంశాలకు న్యాయం చేయలేదనడం సరికాదన్నారు. ఒక వేళ ఏమి చేయలేదో చూపిస్తే చేసేందుకు కృషి చేస్తామని పురందేశ్వరి తెలిపారు.