నీ విష్ గొప్పది..కంగ్రాట్స్

చెత్త ఏరుకునే వ్యక్తి కొడుకు భవిష్యతులో డాక్టర్ కాబోతున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే చూసే ఇలాంటి ఉదంతం రియల్ లైఫ్ లో చూడబోతున్నాం. మధ్యప్రదేశ్ దేవాశ్ జిల్లాలో అతి పేద కుటుంబానికి చెందిన ఆశారాం చౌదరి డాక్టర్ కాబోతున్నాడు. ఇతని తండ్రి రంజిత్ చౌదరి చెత్త ఏరుకుంటూ ఆ వచ్చే చాలీ చాలని సంపాదనతో ఎలాగో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతని 20 ఏళ్ళ కొడుకు ఆశారాం.. ఇటీవల ఆలిండియా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) నిర్వహించిన ‘ నీట్ ‘ ప్రవేశ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్ లోనే పాసయ్యాడు. జోద్ పూర్ లోని ఈ వైద్య సంస్థలో ఇతనికి అడ్మిషన్ లభించింది.
అయితే ఇక్కడ ఎంబీబీఎస్ చదివే ఆర్ధిక స్తోమత ఇతనికి లేదు. తమది పూరి పాక అని, ఇంట్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదని చెప్పిన ఆశారాం..తను డాక్టర్ అయితే తన గ్రామానికి  వచ్చి ఉచితంగా పేదలకు సేవ చేయాలనుకుంటున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా…వార్తా సాధనాల ద్వారా ఇతని గురించి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి తెలిసింది. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆశారాం విద్యకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

 
ఆయన ఆదేశంపై దేవాశ్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండే ఈ కుర్రాడి ఇంటికి స్వయంగా వచ్చి సత్కరించారు. అలాగే అపోలో ఆసుపత్రి గ్రూపు ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సి.ప్రతాప రెడ్డికి ఇతని గురించి సమాచారం తెలియగానే ఇతడ్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడి ఎంబీబీఎస్ కోర్సు చదవడానికి అయ్యే ఆర్ధిక సాయాన్ని అందజేయాలనుకుంటున్నారని ఈ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ సిబాల్ తెలిపారు. మరోవైపు-కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ .అశారాం చౌదరిని అభినందిస్తూ అతనికి లేఖ రాశారు. నీ అభీష్టం గొప్పది.. డాక్టర్ కావాలన్న నీ కోరిక తప్పక తీరుతుంది అన్నారు.