తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి కుటుంబం ‘జనసేన’లో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఆకుల సత్యనారాయణకు తాను మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆకుల కుటుంబం జనసేన పార్టీకి అండగా ఉండి ప్రోత్సహిస్తుందని ఆకాంక్షించిన పవన్, ఆకుల దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు.

రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఆయన భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి ఈరోజు(సోమవారం) జనసేన పార్టీలో చేరిన సందర్భంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆకుల దంపతుల్ని పవన్ జనసేన కండువా కప్పి ఆహ్వానించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు జనసేన అతీతమని ఈ సందర్భంగా పవన్ అన్నారు. సమర్థ, పారదర్శకమైన పాలన ‘జనసేన’తోనే సాధ్యమని.. చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అవినీతి మయమైపోయాయని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు. రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అంతకుముందు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సంఘం నాయకుడు బొమ్మిడి నాయకర్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. నాయకర్ సహా ఆయన అనుచరులకు ‘జనసేన’ కండువాలను కప్పి పార్టీలోకి పవన్ ఆహ్వానం పలికారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *