సినిమా పేరు: ‘పేట’
విడుద‌ల తేదీ‌: 10-01-2019
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్రన్‌
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్‌: వివేక్ హ‌ర్షన్
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్లభ‌నేని
ద‌ర్శక‌త్వం: కార్తీక్ సుబ్బరాజు
బ్యానర్‌: స‌న్ పిక్చర్స్‌
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు త‌దిత‌రులు

ఆరుపదుల వయసులోనూ అల్లాడిస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక పక్క 2.0 వంటి భారీ సినిమాలో నటిస్తూనే పనిలోపనిగా చకచకా వేరే ప్రాజక్టులకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టపటపా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. త‌లైవా సినిమా రిలీజ్ అంటే తమిళతంబీలకు ఒక పెద్ద పండ‌గ‌లాంటిదే. అయితే, తెలుగులోనూ ర‌జ‌నీ అభిమానులకు లోటులేదన్న సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తో మళ్లీ వెండితెరమీద పేట అంటూ ఇవాళ ముందుకొచ్చారు రజనీ.. భారీ తారాగణం నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

స్టోరీ : కాళీ (రజనీకాంత్‌) ఒక హాస్టల్‌లో వార్డెన్‌గా వర్క్ చేస్తుంటాడు. అక్కడ మైకేల్‌( బాబీ సింహ‌) అండ్ గ్యాంగ్ జూనియ‌ర్స్‌ను తరచూ ఇబ్బంది పెడుతుండటం చూసి వారిని అడ్డుకుని హాస్టల్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఈ క్రమంలో అక్కడే పనిచేసే డాక్టర్‌(సిమ్రన్‌)తో కాళీకి పరిచయం ఏర్పడుతుంది. అంతా సరదా, సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్‌ గూండాతో గొడవ అవుతుంది. దీనికి కారణం అన్వర్ అనే కుర్రాడి ప్రేమ విషయంలో కాళీ ఎంటర్ కావడాన్ని సహించలేని తండ్రి కొంత మందిని పంపి కాళీని కొట్టమ‌ని పంపుతాడు. అదే సమయంలో అత‌ను కాళీ కాద‌ని పేట వీర అని తెలుస్తుంది. అత‌నికి ఉత్తర‌ప్రదేశ్‌లోని సింఘా(న‌వాజుద్దీన్ సిద్ధికీ)కి పాత ప‌గ‌లున్న బ్యాక్ డ్రాప్ వెలుగులోకి వస్తుంది. అసలు ఈ ఖాళీ ఎవరు? ఎందుకు హాస్టల్ వార్డెన్ అయ్యాడు? పేట తిరిగి యూపీ వెళ్లాడా.. లేదా..? అన్నదే కథ.

విశ్లేషణ : చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ త‌నదైన స్టైల్‌ను చూపించుకోవ‌డానికి ‘పేట’ చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. సినిమాలో రజనీని చూసినంతసేపూ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చేలా తీర్చిదిద్దాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. మొదట్లో ఈ మూవీలో వచ్చే స‌న్నివేశాలు, ‘న‌ర‌సింహ’, ‘ముత్తు’, ‘అరుణాచ‌లం’ ‘భాష’ వంటి సినిమాల్ని గుర్తు చేస్తాయి. సెకండాఫ్ వరకూ అసలు కథలోకి సినిమా వెళ్లదు. సెకండాఫ్ లో చాలా స్ట్రాంగ్ గా బ్యాక్ డ్రాప్ చెప్పేలా కథనం సాగడం సినిమాకు ప్లస్ అయింది. తొలి స‌గంలో ర‌జ‌నీ మేన‌రిజ‌మ్స్‌, స్టైల్‌ కు పెద్దపీట వేసిన డైరెక్టర్.. సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌, హీరో తీర్చుకునే ప‌గ‌తోనూ ఫినీష్ చేశాడు.

కొంత కాలంగా నిరాశ ప‌డుతున్న రజనీ అభిమానుల‌కు మాత్రం ఈ మూవీ బిర్యానీ లాంటిది. పాటలు స్పీడ్ బ్రేకర్లు లా మారాయి. అయితే, ఫస్ట్ పార్ట్ రక్తికట్టించగలిగిన సుబ్బరాజు, సెకండాఫ్ లో కాస్త తడబడ్డట్టు కనిపించింది. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించకపోవచ్చు. అనిరుధ్ నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్‌. తిరు సినిమాటోగ్రఫిలో రిచ్ నెస్ కనిపిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు రజనీ సినిమా స్థాయికి తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా ఉన్నాయి. ఓవరాల్ గా రజనీ ఫ్యాన్స్ కు సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *