బాలయ్య, మెగాబాబుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకవైపు అగ్లీ టర్న్ తీసుకుని.. టాలీవుడ్‌లో రొచ్చు క్రియేట్ చేస్తుండగానే.. ఇదే రొచ్చులో ఒక రాయేసి మరింత గబ్బుకు కారణమయ్యారు ప్రసన్న కుమార్ అనే నిర్మాత. సంక్రాంతి సినిమాల మధ్య జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఆయన చేసిన ఒక కామెంట్ మెగా ఫ్యామిలీకి మంటెక్కిస్తోంది.

రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘పేట’ మూవీ ఈనెల 10న రిలీజ్ కానుంది. సర్కార్, నవాబ్ లాంటి కోలీవుడ్ సినిమాల్ని తెలుగీకరించిన వల్లభనేని అశోక్ ఈ ‘పేట’ చిత్రాన్ని కూడా టాలీవుడ్‌లోకి తీసుకొస్తున్నారు. ట్రైలర్ ద్వారా గొప్ప అంచనాల్ని సృష్టించిన ఈ మూవీ.. రజనీ కెరీర్లో మరో ‘బాషా’గా నిలబడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్టీయార్ బయోపిక్ ఫస్ట్ పార్ట్, రామ్ చరణ్ ‘వినయవిధేయ రామ’, వెంకీ-వరుణ్ కాంబో ‘ఎఫ్2’ సినిమాలు సంక్రాంతి బరిలో వున్నాయి. ఒకటీరొండు రోజుల తేడాతో రానున్న ఈ మూడు సినిమాలతో  పాటు నేను సైతం అంటూ రజనీ ‘పేట’ కూడా దిగేసింది. థియేటర్ల పంపకాల దగ్గర నానా తంటాలు పడి ఎలాగోలా విడుదల ఖరారు చేసుకున్న ‘పేట’ నిర్మాతలు.. ప్రమోషన్లో కూడా అగ్రెసివ్‌గా దూసుకుపోతున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ‘పేట’ ప్రీరిలీజ్ ఈవెంట్ వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికయ్యింది. అమెరికాలో వున్న రజనీ ఈవెంట్‌కు రాకపోయినప్పటికీ.. ఆమేరకు పబ్లిసిటీ రాబట్టుకోడానికి.. తమదైన ట్రెండ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా యూనిట్.  ”ఎన్టీయార్ మహానుభావుడు.. రజనీకాంత్ మాస్ ప్రేక్షకుల దేవుడు.. వీళ్లిద్దరి సినిమాలే ఈ పొంగల్ రేసులో నిలబడతాయి. మిగతావన్నీ ‘పందుల్లా’ చెల్లాచెదరైపోతాయి” అన్నారు నిర్మాత ప్రసన్న కుమార్.

‘ఎఫ్2’ చేస్తున్న వరుణ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలో చేస్తున్న రామ్ చరణ్.. ఇద్దరూ మెగా ఫ్యామిలీ హీరోలు. నిర్మాత ప్రసన్న చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా వీళ్లిద్దరి గురించే! తమ సినిమా ప్రమోషన్ కోసం మిగతా సినిమా వాళ్ళను దూషించడం దేనికంటూ అక్కడికక్కడే అతడికి అక్షింతలు పడ్డాయి. ఇటు.. అతడు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మెగాబాబు-బాలయ్యల మధ్య ఇప్పటికే మంట పుట్టిన క్రమంలో ప్రసన్న కుమార్ కామెంట్లతో అది మరింత రాజుకుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *