'రెడ్ స్టార్' మెమోరియల్ మీట్

దివంగత విప్లవ నటులు, దర్శకనిర్మాత, ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు మెమోరియల్ మీట్ ఆద్యంతం ఉత్తేజ భరితంగా, ఉద్విగ్నంగా సాగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తనయుడు మాదాల రవితోపాటు మాదాల రంగారావుతో పరిచయమున్న అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సమాజంలోని సామాన్య, బడుగు, బలహీన వర్గాల ఉన్నతికోసం తాను నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా మాదాల జీవించారని ఈ సందర్భంగా వక్తలు కీర్తించారు. సినీ రంగాన్ని ఆసరాగా చేసుకుని మాదాల ముందుకెళ్లిన ప్రస్తానాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న మాదాల రంగారావు మే 27న హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

నాటకాల్లో నటించిన రంగారావు మొదటిసారిగా నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై ‘యువతరం కదిలింది’ సినిమాను 1980లో తీశారు. తర్వాత సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలను రూపొందించారు. ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, జనం మనం, ప్రజాశక్తి చిత్రాల్లో నటించి రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న మాదాల రంగారావు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ శర్మ కాలేజీలో బీఏ చదివిన ఆయన నల్లూరి వెంకటేశ్వర్లు సాహచర్యంలో కళాకారుడిగా రూపుదిద్దుకున్నారు.