మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు ఫలితం దోబూచులాడింది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కుతుందన్న స్పష్టత రాక.. కాంగ్రెస్-బీజేపీల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరికి రెండు సీట్లు తక్కువైనా.. మాయావతిని జతచేసుకుని గట్టెక్కింది కాంగ్రెస్ పార్టీ. తృటిలో గెలుపును చేజార్చుకున్న కమల శిబిరం మాత్రం ఉస్సూరుమనాల్సి వచ్చింది. చప్పుడు చేయకుండా సీఎం పదవికి రాజీనామా చేసి గంభీరంగా బైటికొచ్చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్.

గెలవకపోయినా.. గెలుపు అంచుల దాకా చేరి.. మళ్ళీ వెనక్కు రావడమంటే ఎవ్వరికైనా మనసు కష్టంగానే ఉంటుంది. కానీ.. చౌహాన్.. ఆ బాధనంతా గుండెల్లో కుక్కేసుకుని.. ఎటువంటి ఆవేశపూరిత ప్రకటన చేయకుండా గుంభనంగా ఉండిపోయారు. ఈ విషయంలో మిగతావాళ్ళ భావన ఎలా ఉన్నప్పటికీ.. ఎక్కడో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ మాత్రం ట్విట్టర్ ద్వారా వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే ఖుష్బూ.. ఈ ట్విట్టర్ ద్వారా తన చతురతను చాటుకుంది.

”ఓటమి సంభవించినప్పుడు గౌరవప్రదంగా మసలుకోవడం ఇవ్వాల్టిరోజుల్లో ఎవ్వరి దగ్గరా కనపడదు. మీరు మాత్రం డిగ్నిటీ మెయింటెయిన్ చేశారు.. మీరు సూపర్ సార్..” అంటూ ఖుష్బూ చేసిన ట్వీట్‌కి.. చౌహాన్ కూడా వెంటనే స్పందించారు. ”మీ మాటలు నచ్చాయి.. అనునయింపునకు కృతజ్ఞతలు” అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ముద్దముద్దగా మురిపెంగా రిప్లయ్ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేజిక్ ఫిగర్‌కి అతి చేరువలోకొచ్చిన బీజేపీ.. నానా యాగీ చేసి.. గవర్నర్‌ని ‘మానేజ్’ చేసి.. యడ్యూరప్పకు కుర్చీ కట్టబెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీమ్ కోర్ట్ మొట్టికాయ వేయడంతో.. మెలికలు తిరుగుతూ వెనక్కు తగ్గింది. ఆ వైనాన్ని గుర్తు చెయ్యడం కోసమే ఖుష్బూ ఇలా సెటైర్ వేసిందని.. అది చౌహాన్ సాబ్‌కి అర్థం కాలేదని ట్రోలర్లు దాడి షురూ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *