వెబ్ ప్రపంచం మీద తమదంటూ ఒక ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు అంశంపై రష్యా సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది. ఇప్పటికే ఒక పకడ్బందీ  బిల్లు రూపొందించుకుని చట్టసభల్లో ఆమోదం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా దేశం. రష్యన్ ఆన్లైన్ వరల్డ్ మీద విదేశీ జోక్యాన్ని నివారించే క్రమంలో తయారయ్యే ఈ బిల్లును ఒక ‘ఇనుప గోడ’గా అభివర్ణిస్తోంది అక్కడి మీడియా.

450 మంది సభ్యులున్న పార్లమెంట్ లోయర్ ఛాంబర్లో ఇప్పటికే ఈ బిల్లుపై తొలి ఓటింగ్ పూర్తయింది. రష్యన్ వెబ్ ట్రాఫిక్‌ని, డేటాని స్టేట్ అథారిటీస్ ద్వారా నియంత్రించడం ఈ బిల్లులోని కీలక అంశం. మిగతా దేశాల నుంచి మౌలిక తోడ్పాటు లేకపోయినప్పటికీ సొంతంగా ఇంటర్నెట్ వ్యవస్థను నిర్వహించుకోగలిగేలా ‘నేషనల్ డొమైన్ నేమ్ సిస్టమ్’ని రూపొందించుకోవడం ఈ బిల్లు మరో ఉద్దేశం.

గత ఏడాది అమెరికా ఆమోదించిన జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని, దాని ప్రభావాన్ని పరిశీలించిన తర్వాతనే రష్యా  ఈ చట్టాన్ని రాసుకున్నట్లు తెలుస్తోంది. అగోరా అనే మానవ హక్కుల సంస్థ మాత్రం.. ఈ బిల్లు ఇంటర్నెట్ ఫ్రీడమ్‌ని తీవ్రంగా హరించేదిగా ఉందని, వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తోంది. రష్యాలోని పారిశ్రామిక, ఔత్సాహికుల సమాఖ్య కూడా వీరికే వంత పాడుతోంది. దీంతో ప్రయోజనాల కంటే దుష్ప్రయోజనాలే ఎక్కువని, ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రష్యన్ ఇంటర్నెట్ సెగ్మెంట్’.. నిర్వహణలో చాలా రిస్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతోంది.

ఈ బిల్లు ప్రకారం నిషేదిత కంటెంట్‌ని బ్లాక్ చేయడానికి, వెబ్ ట్రాఫిక్‌ని గుర్తించడానికి ప్రత్యేక నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాల్సి వుంది. వెబ్ ప్రపంచంలో రష్యన్ సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచే క్రమంలోనే ఈ బిల్లును తయారుచేశామని రష్యన్ సర్కార్ చెబుతోంది. దీనిపై దిగువ సభలో మరో రెండు ఓటింగ్‌లు జరగాల్సి వుంది. తర్వాత ఎగువసభలో ఆమోదం పొంది, ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంతకం పెడితే తప్ప ఇది చట్టరూపం దాల్చే అవకాశం లేదు.

నిజానికి గత ఐదేళ్ల నుంచి ఇంటర్నెట్ చట్టాల మీద రష్యా ప్రత్యేక దృష్టి పెట్టింది. రష్యన్ యూజర్ల పర్సనల్ డేటాని భద్రపరచడానికి దేశీయ సర్వర్లను ఇంతకుముందే సిద్ధం చేసుకుంది. తాజా చట్టం అమల్లోకి వస్తే.. ‘రష్యన్ ఇంటర్నెట్’ మిగతా గ్లోబల్ నెట్వర్క్‌తో ఏమాత్రం ప్రమేయం లేకుండా విడిగా నడిచే ఆస్కారం ఏర్పడుతుంది. ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని మొదటినుంచీ ధిక్కరిస్తూ వస్తున్న రష్యా.. ఈ సొంత ఇంటర్నెట్ ద్వారా తమ అస్థిత్వాన్ని మరింత భద్రపర్చుకోవాలని ఆశిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *