సీబీఐ మాజీ బాస్ నాగేశ్వరరావుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర చేసింది. ముజఫర్‌పూర్‌ వసతి గృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎస్‌కే శర్మను బదిలీ చేశారు అప్పటి సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వరరావు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టేనని నిర్ధారించిన న్యాయస్థానం, ఆయనకు అసాధారణ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానాతోపాటు న్యాయస్థానం కార్యకలాపాలు ముగిసేంతవరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని ఆదేశించింది.

అంతకుముందు ఈ వ్యవహారానికి సంబంధించి నాగేశ్వరరావు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఆయన తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తన వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు విన్నవించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారం కాకపోతే మరేంటీ? దీనికి శిక్ష పడాల్సిందే. నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం. దీంతో పాటు ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు వెళ్లి కోర్టు గదిలో ఓ పక్కన కూర్చోండి’ అని ధర్మాసనం ఆదేశించింది.

అసలేం జరిగింది?

ముజఫర్‌పూర్‌ అత్యాచారాల కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను బదిలీ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి అప్పటి సీబీఐ బాస్ నాగేశ్వరరావు, ఎస్‌కే శర్మను ఆ కేసు దర్యాప్తు నుంచి తప్పించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేస్తూ నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *