తెరమీద ఏదైనా సహజ విరుద్ధంగా, అతిశయంగా అనిపిస్తే ‘అదంతా గ్రాఫిక్స్ గురూ..’ అంటూ తేలిగ్గా తీసుకుంటాం. కానీ.. కొన్నాళ్ల తర్వాత ఆ గ్రాఫిక్సే రియాలిటీలోకొస్తున్న సందర్భాల్ని అనేకం చూస్తున్నాం. ఒకప్పుడు సినిమాల్లో రోబోల్ని చూపించి.. ప్రేక్షకుడ్ని ఆశ్చర్యంలో ముంచెత్తితే.. ఇప్పుడా రోబోలు నిజరూపంలోకొచ్చి కళ్లెదుటే సాక్షాత్కారమవుతున్నాయి. థాంక్స్ టు.. సైన్స్ అండ్ టెక్నాలజీ.

టెర్మినేటర్2, జడ్జ్‌మెంట్ డే లాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కనిపించిన ఒక అరుదైన దృశ్యం కూడా ఇప్పుడు రియాలిటీకొచ్చేసింది. విలన్ శరీరం మొత్తం ఒక్కసారిగా లిక్విడ్ మెటల్‌గా మారి బాగా సాగి.. కరిగిపోతుంది. అరె.. ఇదేదో భలే వుందే.. అనుకున్నారందరూ. ఇప్పుడు ఆ లిక్విడ్ మెటల్‌ని సుసాధ్యం చేశారు రీసెర్చర్లు. గాలియం లాంటి కొన్ని లోహాలు.. నికెల్ గానీ ఐరన్ కానీ కలిసినప్పుడు మెత్తబడి.. మనం కోరుకున్న షేపుల్లోకి, సైజుల్లోకి మారిపోతాయట. సదరు లోహ సముదాయానికి మాగ్నెటిజం అప్లై చేయడం ద్వారా ఈ లిక్విడ్ మెటలర్జీ సాధించవచ్చని తేలింది.

ఉపరితల ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల మొదట ఇది సమాంతరంగా మాత్రమే సాగేది. నీళ్లలో ముంచినప్పుడు ఒకరకంగా, నీళ్ల వెలుపల మరోలా స్వభావాన్ని మార్చుకునేది. మరిన్ని ప్రయోగాల ద్వారా ఈ రెండు లోపాల్ని కూడా సరిదిద్దారు. దీన్ని రెండు ఎలెక్ట్రోడ్స్‌తో కనెక్ట్ చేయడం ద్వారా LED బల్బ్‌ని కూడా వెలిగించవచ్చు. సాఫ్ట్ రోబోటిక్స్ రంగంలో సైంటిస్టులకు ఈ లిక్విడ్ మెటల్స్ విరివిగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *