వేలకొద్దీ వచ్చిన దరఖాస్తుల్ని విడతల వారీ వడబోతలతో కుదించి.. తొలి జాబితా విడుదల చేసింది జనసేన పార్టీ. ఏపీ అసెంబ్లీలో ఈసారి ఎలాగైనా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాతినిధ్యం సాధించాలన్న కసితో రూపొందించిన ఈ జాబితాను పార్టీ అత్యంత కీలకంగా భావిస్తోంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లోకీ ఈ 32 మందిలోనే ఎక్కువ సంఖ్యలో గెలుపుగుర్రాలున్నాయన్నది పార్టీ స్క్రీనింగ్ కమిటీ భావన.

మిగతా రెండు పార్టీల శక్తి సామర్థ్యాల్ని దీటుగా ఢీకొట్టాలి కనుక.. అభ్యర్థుల ఎంపికలో ధన బలం మీదే ఎక్కువ దృష్టి పెట్టక తప్పలేదు జనసేనకి. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణే నేరుగా అంగీకరించారు. తొలి జాబితాలో ఎన్నారైలు, బిజినెస్ మాగ్నెట్స్ కోటా బలిష్టంగా కనిపిస్తోందని విశ్లేషణలొస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. దక్షిణాంధ్రలోని ఒక నియోజకవర్గం నుంచి ‘కళంకితుడ్ని’ ఎంపిక చేశారన్న విమర్శ ఒక్కటీ ఒక ఎత్తు.

హైదరాబాద్‌లో పారిశ్రామిక సామ్రాజ్యం కలిగిన ఈ వ్యక్తి.. తనకు లభించిన ఆకస్మిక సంపద కారణంగా ఓవర్‌నైట్‌లో ‘బిగ్ షాట్’గా మారాడని, అతడి మీద హత్య అభియోగాలు కూడా ఉన్నాయని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులందాయి. కానీ.. అతడికున్న ధన బలమే నియోజకవర్గంలో ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న అంచనా అయితే బలంగా వుంది. స్థానికంగా జరిపిన సర్వే ఆధారంగానే అతడి మీద విశ్వాసం ఉంచినట్లు జనసేన స్క్రీనింగ్ కమిటీ సమర్ధించుకుంటోంది. ఏదేమైనా.. ఒక్కసారి ఖరారైన జాబితాలో మళ్ళీ చేతులు పెట్టే ఆలోచన తమకు లేదని గట్టిగా చెబుతున్నారు జనసేన ట్రబుల్ షూటర్లు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *