మన ప్రమేయం లేకుండా మనం అనుక్షణం చేసే అసంకల్పిత చర్య.. ఊపిరి పీల్చడం. శ్వాసనిశ్వాసల ప్రక్రియ అనేది జీవన క్రియల్లో అత్యంత కీలకమైనది కూడా. అది ఆగిపోతే మనుగడ ఆగిపోయినట్లే లెక్క. నిజానికి.. శ్వాస తీసుకోవడంలో ప్రత్యేకతేముంది.. అది అందరికీ స్వతహాగా తెలిసిందే కదా అనుకుంటాం..! కానీ.. బ్రెత్ వర్క్ అనేది కూడా క్రూషియల్ సబ్జెక్ట్ అని.. క్రమంగా ఇది పాపులర్ అవుతోందని.. మానసిక, శారీరక స్వస్థత రంగంలో దీని ప్రాధాన్యత పెరుగుతోందని ఎప్పుడైనా గ్రహించామా? మానసిక ఒత్తిళ్లు తగ్గించడం, ఏకాగ్రత పెంచడం, సుఖ నిద్రకు ఆస్కారం కలగడం లాంటివన్నీ ఈ ‘బ్రెత్ వర్క్’తోనే సాధ్యం కనుక.. ‘నాణ్యమైన శ్వాస’ అనేది కీలకం అయి కూర్చుంది.

‘యోగా’ శాస్త్రంలో ఏడెనిమిది రకాల ప్రాణాయామం ఆసనాలు.. వంద శాతం శ్వాస నిచ్వాసలకు సంబంధించినవే. ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి రుగ్మతను కూడా దగ్గరకు రానివ్వని యోగ్యత వీటి ద్వారా లభిస్తుంది. కానీ.. ‘శ్వాస’ అనేది అక్కడితో సరిపొయ్యేది కాదని, అందులో అంతకుమించి ఉందని కొన్ని లోతైన అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు.. మనం తరచూ చేసే వర్టికల్ బ్రెతింగ్..! భుజాలు పైకెగిరేలా ఛాతీ ఎగిరిపడేలా తీసుకునే ఈ శ్వాస ద్వారా ఉదర భాగంలో మాత్రం కనీస కదలిక ఉండదు. ఇది మనం తెలిసీతెలిసీ చేస్తున్న తప్పిదమట. మనం చేసే ఇటువంటి అనేక శ్వాస సంబంధిత పొరబాట్లను సరిదిద్దడానికి ‘బ్రెత్ వర్క్’ అనే సరికొత్త ఎక్సర్‌సైజ్ షురూ అయింది.

కొన్ని మహానగరాల్లో.. యోగాతో పాటు ‘మైండ్ స్టూడియో’లను ఏర్పాటు చేసి ‘శ్వాస మీద ధ్యాస’ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం పరిపాటి. సిలికాన్ వ్యాలీ, లండన్‌లలో ఒకప్పుడు స్టార్ అథ్లెట్స్, సెలబ్రిటీలు మాత్రం ఈ ‘బ్రెత్ వర్క్’ క్లాసులకు అటెండ్ అయ్యేవారు. ఇప్పుడు.. ఏకంగా యోగాకు దీన్ని అనుసంధానం చేసి నేర్పిస్తున్నారు. ఉదాహరణకు.. రిలాక్సేషన్ కోసం వాడే ‘హెలోట్రోపిక్ బ్రెత్ వర్క్’ అనే 40 ఏళ్ల నాటి ప్రక్రియ.. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్‌గా మారి ఒక బిగ్ సైజ్ బిజినెస్‌గా చెలామణీ అవుతోంది. ఇంకా.. ఆలోచన శక్తి విస్తరించడం, శారీరక శక్తి పెరగడం, మానసిక ఆందోళన తగ్గించడం లాంటి ప్రయోజనాలు కల్గించే ప్రత్యేక తరహా ‘బ్రెత్ వర్క్స్’ కూడా కొన్నుంటాయి. మనం తీసుకునే శ్వాసకు సమాంతరంగా గుండె కొట్టుకోవడం జరగాలని, ఈ రెండు ప్రక్రియలూ లయబద్ధంగా క్రమ పద్ధతిలో నడిచినప్పుడే మన బ్రెత్ వర్క్ సజావుగా ఉన్నట్లు పరిగణించాలని ఫిజియాలజిస్టులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *