బాబు చెబితే మాత్రం అంత రిస్క్ చేయాలా? తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఇప్పుడివే సెటైర్లు.. సానుభూతి వచనాలు. మరో రెండునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. మరో రెండేళ్ల గడువు మిగిలి ఉండగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ అనూహ్య నిర్ణయం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.

నిజానికి.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మొదటినుంచీ ప్రత్యక్ష ఎన్నికలే బాగా అలవాటు. గెలిచినా, ఓడినా తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి మీద ఆయనకు బాగా గురి. నెల్లూరు జిల్లా స్థాయి నేతగా పేరున్నా సర్వేపల్లిని మాత్రం ఆయన పాతికేళ్ల నుంచీ వదిలిపెట్టలేదు. 1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు. కానీ.. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2004, 2009 ఎన్నికల్లో సోమిరెడ్డి మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 2014లో కూడా వైసీపీ అభ్యర్థి చేతిలో సోమిరెడ్డి కొద్ది తేడాతోనే ఓటమిపాలయ్యారు. తర్వాత చంద్రబాబు పిలిచి ఎమ్మెల్సీ సీటిచ్చారు.

ఈసారి 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచే అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలన్నది సోమిరెడ్డి పట్టుదల. టిక్కెట్ గ్యారంటీ వుంది కనుక ఇప్పటినుంచే జనంలో తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టారు. కానీ.. తన ఎమ్మెల్సీ పదవి ఆయన నైతికతను ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం వేలెత్తిచూపక ముందే ఎమ్మెల్సీ పోస్ట్ వదిలేసుకుని.. ఓపెన్‌గా బరిలోకి దిగాలన్న కమిట్మెంట్ ఆయన్ను పెద్దల సభకు రాజీనామా చేసేలా పురిగొల్పింది. రెండేళ్ల గడువు మిగిలి ఉండగానే బంగారం లాంటి ఎమ్మెల్సీ పదవిని వదులుకున్న సోమిరెడ్డి మొండిధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటున్నారు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకున్నారంటూ మరికొందరు సానుభూతి కురిపిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *