”కోడెల వద్దు.. చంద్రబాబే ముద్దు..” అనే విచిత్రమైన నినాదం ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో రీసౌండ్ ఇస్తోంది. టీడీపీ సీనియర్ పొలిటీషియన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా, మాజీ మంత్రిగా అనేక హోదాల్లో వెలిగిన కోడెల శివప్రసాద్ రావుకి స్థానికంగా సీటు కింద వేడి పుట్టడం ఆసక్తికరంగా మారింది. నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికై, చంద్రబాబు కోరిక మేరకు 2014లో సత్తెనపల్లి నుంచి బరిలో దిగి.. విజయం సాధించిన కోడెల.. స్పీకర్‌గా ఉంటూనే.. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కొన్ని మౌలిక విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా.. ఆయన మళ్ళీ సత్తెనపల్లికి వస్తే గెలిపించే ప్రసక్తే లేదంటూ లోకల్ క్యాడర్ మొండికేస్తోంది. ఇంతకీ.. కోడెలకు ఎర్త్ పెట్టే ఈ పరిస్థితి ఎందుకు దాపురించినట్లు? అంటే.. ఒక ఆసక్తికర వాదన వినిపిస్తోంది.

అసెంబ్లీ సభాపతి హోదా అనేది ఎంతటి గౌరవప్రదమైనదో.. అంతకంటే ప్రమాదకరమైనది..! అధ్యక్షా అని పిలిపించుకోవాలంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది.. కానీ.. ఆ అధ్యక్ష పీఠం వెనకుండే ఒక సెంటిమెంట్ మాత్రం భయపెట్టి చంపేస్తుంది. ఒకసారి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైతే.. ఆ తర్వాతి ఎన్నికల్లో అతడికి అసెంబ్లీలో ఎంట్రీ దొరకదన్నది ఒక బలమైన సెంటిమెంట్. శ్రీపాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, కేఆర్ సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి నిన్నటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి దాకా అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. అందుకే.. అసెంబ్లీ స్పీకర్ పదవిని అనుమానాస్పదంగా చూస్తారు.

కోడెల సీనియారిటీని గౌరవించి కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి అసెంబ్లీకి సభాపతి హోదా ఇచ్చారు సీఎం చంద్రబాబునాయుడు. మహా ప్రసాదం అంటూ అప్పటికైతే స్వీకరించారు గానీ.. తరువాత్తర్వాత అసెంబ్లీలో ఆయనకు ఎన్నోసార్లు చుక్కలు కనబడ్డ మాట వాస్తవం. జగన్, రోజా, అంబటి లాంటి అపోజిషన్ లీడర్లు కోడెలను ‘క్రిమినల్ నంబర్ 1’ అనేదాకా వెళ్ళింది వ్యవహారం. మూడు సెషన్ల పాటు ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ నడపాల్సిన దురవస్థ కూడా ఆయనకే పట్టింది. స్పీకర్ కుర్చీ అన్న తర్వాత ఇవన్నీ మామూలే కనుక సర్దుకుపోయారు కోడెల. కానీ.. ‘రీఎంట్రీ’ సెంటిమెంట్ విషయంలోనే ఆయనకు చెమటలు పెట్టేస్తున్నాయి.

పార్టీకి మంచి విధేయుడిగా పేరున్న కోడెలకు ఈసారి పోటీ చెయ్యడానికి దీటైన నియోజకవర్గమే కరువైంది. సిట్టింగ్ సెగ్మెంట్ సత్తెనపల్లిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో నర్సరావుపేట ఎంపీగా పంపడానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ.. ‘నేను పోటీ చేయబోయేది సత్తెనపల్లె నుంచే’ అంటూ తాజాగా కోడెల ప్రకటించేసుకున్నారు. కానీ.. సత్తెనపల్లి ఆయన్ను మళ్ళీ గెలిపించుకుంటుందా? అనే సంశయం పార్టీతో పాటు కోడెలను కూడా వేధిస్తోంది.  స్పీకర్ సెంటిమెంటే పామై కరుస్తుందన్నది ఆయన భయం. అంతా కుర్చీ మహిమ..?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *