ప్రిన్స్ కోసం పేరు మార్పు!

ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి ‘మల్టిస్టారర్’ ట్రై చేస్తున్నాడు. తన 25వ మూవీలో మరో హీరో అల్లరి నరేష్‌కి ఛాన్స్ ఇస్తూ.. కొత్త ట్రెండ్‌కి తెర తీశాడు. గతంలో SVSCలో వెంకటేష్‌తో జత కట్టి.. సూపర్ సక్సెస్ కొట్టిన ప్రిన్స్.. ఈసారి కూడా అటువంటి ఎఫర్ట్‌నే వర్కవుట్ చేస్తున్నాడు. సరే.. ఇదంతా ఎప్పట్నుంచో వింటున్న పాత ముచ్చటే. మరి కొత్త విషయం ఏమిటి? మహేష్#25లో అల్లరి నరేష్ చెయ్యబోయే రోల్ ఎటువంటిది? ప్రిన్స్‌కి సోదరుడిగా నటిస్తున్నాడా లేక, స్నేహితుడిగా చేస్తున్నాడా? చేస్తే అతడి పాత్రకుండే ప్రాధాన్యత ఎంత? లాంటి సందేహాలు మహేష్ అభిమానుల్ని కొన్నాళ్లుగా వేధిస్తున్నాయి. మూవీ ప్రొడక్షన్ పార్ట్ వేగంగా పూర్తవుతున్న క్రమంలో.. కొద్దికొద్దిగా కంటెంట్ రిలేటెడ్ సస్పెన్స్‌ని కూడా విడదీస్తోంది యూనిట్. అల్లరి నరేష్ 37వ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ పనిలోపనిగా ఫిలింనగర్‌కి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

”మా రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది. మహేష్ 25వ మూవీ నీకు మరింత మంచి భవిష్యత్తునిస్తుందని ఆశిస్తున్నాం..” అన్నది వంశీ ట్వీట్ తాత్పర్యం. తన సినిమాలో అల్లరి నరేష్ పేరు రవి అంటూ ఒక చిన్న క్లూ ఇచ్చి తెలివిగా తప్పించుకున్నారు డైరెక్టర్ పైడిపల్లి. మరి.. ఈ కొత్త పేరుతోనైనా ‘సుడిగాడు’కి సుడి తిరుగుద్దా?