రాజకీయాలతో ప్రస్తుతానికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుత ఎన్నికల సీజన్లో నిలకడ ప్రదర్శించలేక సతమతం అవుతున్నారు. ఇటీవల సహచరుడు కమల్ హాసన్‌కి మద్దతునిస్తున్నానంటూ వచ్చిన ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. మోదీ చేపట్టిన నదుల అనుసంధానం గొప్పగా ఉందంటూ ప్రశంసించడం ద్వారా బీజేపీకి పరోక్ష మద్దతునిచ్చేశారు. ఇలా నిర్దిష్టమైన రాజకీయ వైఖరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్తున్న రజనీకాంత్‌కి మరో అగ్నిపరీక్ష ఎదురైంది.

కన్నడ సూపర్ స్టార్ అంబరీష్‌తో రజనీకాంత్‌కి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇప్పుడు అంబరీష్ మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్య సుమలత మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీలో వుంది. దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడను ఢీకొంటున్న సుమలత పక్షాన ఇప్పటికే సినిమా సెలబ్రిటీలంతా ప్రచారం చేశారు. రేపటితో ప్రచారం గడువు ముగియనుంది. ఈ క్రమంలో సుమలతకు సంఘీభావంగా ప్రచారం చేయడానికి రజనీకాంత్ కర్ణాటక వస్తున్నారంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.

రజనీకాంత్ నిజంగానే సుమలతకు మద్దతు తెలపనున్నారా? మద్దతునివ్వడంతో సరిపెట్టకుండా నేరుగా ప్రచారంలో కూడా పాల్గొంటారా? అనే సందేహం ఒకవైపు ఉండగానే.. రజనీ టూర్ ఖరారైంది అంటూ స్టేట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. సుమలతకు మద్దతుగా ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. ఇక.. రజనీకాంత్ కూడా.. సీఎం కుమారస్వామి కొడుకును విమర్శిస్తూ సుమలతను పొగుడుతూ ప్రచారం చేసిపెడతారా? అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే వుంది. పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడమనే దుస్సాహసం రజనీకాంత్ చేయబోరన్న మాటయితే గట్టిగా వినిపిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *