నాటకాలొద్దు.. ఎన్టీఆర్‌కి భారతరత్న అడ్డుకుంది మీరుకాదా అంటూ టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. ‘దయచేసి మీరు నాటకాలు ఆడకండి. ఆయన పేరు మీదే ఈరోజు చాలా మంది బతుకుతున్నారు. అసలు ఎన్టీఆర్ లేకపోతే టీడీపీ లేదు.. ఆయనే లేకపోతే ఈరోజు రాష్ట్రాన్ని ఏలే అవకాశమే లేదు. మీరందరూ కలసి ఆయన్ని భ్రష్టుపట్టించకుండా ఉంటే చాలా మంచిదంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తారని ఆయన అభిమానులు గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారని.. అయితే అసలు ఎన్టీఆర్‌కి భారతరత్న రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబేనంటూ తెగేసి చెప్పేశారు.

ఏటా పద్మా అవార్డులు ప్రకటించేశాక ఎన్టీఆర్‌కి భారతరత్న ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడం ఫుల్ కామెడీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవి వస్తే వదిలేసి కేంద్రంలో చక్రం తిప్పానని.. మొత్తం భారతదేశాన్ని నేనే నడిపించానని చెప్పే చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు పట్టుబట్టలేదని ప్రశ్నించారు. మొన్నటి వరకూ నాలుగున్నరేళ్ల పాటు బీజీపీ పార్టీతో సన్నిహితంగా ఉండీ కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు అడగలేదని నిలదీశారు. ఇదంతా చంద్రబాబు చూపిస్తోన్న సినిమాలా ఉందన్నారాయన.

అవార్డులు ప్రకటించేవరకూ సైలెంట్‌గా ఉండి.. ప్రకటించిన తరువాత స్టేట్ మెంట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనికి కారణం కూడా చెప్పారు తమ్మారెడ్డి. ఒకవేళ ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే.. కుటుంబం మొత్తం వెళ్లాలి. అదీ.. ఎన్టీఆర్ భార్యగా ఉన్న లక్ష్మీపార్వతి ఆ అవార్డును తీసుకోవాలి. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేని చంద్రబాబు భారత రత్న అవార్డు ఎన్టీఆర్ కు దక్కకుండా చేస్తున్నారన్నది తమ్మారెడ్డి భరద్వాజ్ ఆరోపణ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *