11 రోజుల దీక్షా రహస్యం.. ఇంతకీ కాయా.. పండా..?

ఈనెల 20న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మొదలుపెట్టిన ఉక్కు దీక్షకు తెరపడింది. సీఎం చంద్రబాబు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కడప స్టీల్ ప్లాంట్ కల సాకారం అయ్యేవరకు పోరాటం ఆగదని పట్టుపట్టినప్పటికీ.. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఎంపీ తన దీక్షకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పరామర్శ కోసం కొడుకు లోకేష్‌తో కలిసి కడపకొచ్చిన చంద్రబాబు.. దీక్షను విరమించవలసిందిగా రమేష్‌కు సూచించారు. పార్టీ అధినేత మాటను మన్నిస్తూ ఎంపీ పట్టు వీడారు. ఎంతకీ దిగిరాని కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ.. మోడీ సర్కారును చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు.

దాదాపు 11 రోజుల పాటు సాగిన రమేష్ దీక్ష కాయా పండా అనే స్పష్టతయితే లేదు. కనీసం కేంద్ర ఉక్కు మంత్రి ధీరేంద్ర కడపకొచ్చి స్పష్టమైన హామీనిస్తారన్న ఆశలు కూడా నెరవేరిన దాఖలా లేదు. ఈ విషయమై టీడీపీ ఎంపీలు రెండుసార్లు ఢిల్లీకెళ్లినా ఫలితం లేకపోయింది. గతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో దీక్షకు దిగిన తెరాస అధినేత కేసీఆర్ కూడా.. సరిగ్గా 11 రోజుల్లోనే ముగించారు. 2009 డిసెంబర్ 10న జరిగిన నాటి దీక్ష విరమణ ఘట్టాన్ని ఇప్పటికీ విజయ్ దివస్‌గా పేర్కొంటూ గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి.. అదే 11 రోజుల ల్యాండ్‌మార్క్ దాటిన సీఎం రమేష్ దీక్ష చరిత్రలో ఎంతమేర నిలిచిపోతుందంటూ.. మీడియాలో టాక్ మొదలైంది.