కేంద్రంలోని మోదీ సర్కార్ అన్నివిధాలుగా ఉతికి ఆరేసే పనిలో నిమగ్నమైంది టీడీపీ. ఓ వైపు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష చేస్తుండగా, మరోవైపు పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు ఎంపీ రామ్మోహన్. పార్టీ అధినేత చంద్రబాబు న్యూఢిల్లీలో ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో వివరించారు. మన్‌కీ బాత్ కాదు.. జన్‌కీ బాత్ కూడా పట్టించుకోవాలంటూ మోడీపై సెటైర్లు వేశారు. 2014లో హోదా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని, ప్యాకేజీ కింద నయాపైసా కూడా ఇవ్వలేదన్నారు. హోదా ఇస్తే తామెందుకు నిరసనలు చేస్తామంటూ విరుచుకుపడ్డారు.

రైల్వేజోన్ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, హక్కుల కోసం బాబు ప్రశ్నించినందుకే.. మోడీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని కేంద్రం వెనక్కు తీసుకుందన్నారు. అవినీతికి పాల్పడినందునే నిధులను వెనక్కు తీసుకొన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏపీ ప్రభుత్వ పనితీరును చూసి కేంద్రమే 647 అవార్డులను ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

1500 కోట్లతో ప్రపంచంలో అత్యుత్తమమైన రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ గురించి మాటల్లోనే కాదు చేతల్లో ఉండాలని కేంద్రానికి చురకలంటించారు. చివర్లో గురజాడ అప్పారావు రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే గేయాన్ని వినిపించి వివరించారు రామ్మోహన్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *