తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా, చంద్రబాబుకు అనుంగు సహచరుడిగా హల్చల్ చేసే రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్.. ఎట్టకేలకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఇక మనోభీష్టాల్ని యధేచ్ఛగా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే.. తనను కాదనుకుని వెళ్ళిపోయిన వాట్సాప్ సదుపాయం.. ఇప్పుడు మళ్ళీ వెదుక్కుంటూ వచ్చేసింది. ఈ మేరకు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆయనొక పసందైన ట్వీట్ కూడా చేశారు.

తన వాట్సాప్ ఖాతాను ఖతం చేశారంటూ సీఎం రమేష్ ఈ నెల 8న మీడియాకెక్కారు. కొన్ని రోజులుగా తన వాట్సాప్ మొరాయిస్తోందని, ఈమేరకు వాట్సాప్ యాజమాన్యానికి మెయిల్ పంపానని చెప్పారాయన. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదులు వరసబెట్టి రావడంతో.. నిషేధం విధించినట్లు వాట్సాప్ నుంచి రిప్లయ్ కూడా వచ్చిందన్నారు. కానీ.. తాను ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, తనపై దురుద్దేశపూర్వకంగానే కొంతమంది ఫిర్యాదు చేశారని సీఎం రమేష్ క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పుడు ఆయన వాట్సాప్ మళ్ళీ బతికొచ్చేసింది.

మరో టీడీపీ నేతకు సైతం వాట్సాప్ నుంచి ఇటువంటి తంటానే పట్టుకుంది. తన వాట్సాప్ కూడా ఆగిపోయిందని కడప జిల్లా తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ ఆర్. శ్రీనివాసరెడ్డి వాపోయారు. తెలుగుదేశం నేతలకు మాత్రమే ఎందుకిలా అవుతోందని ప్రశ్నించిన ఆయన, బీజేపీ-వైసీపీ కుయుక్తుల్లో ఇది కూడా ఒక భాగమని ఆరోపించారు. ఇటు.. వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం కనుక ఫిర్యాదుదారుల వివరాలు బైటపెట్టలేమంటూ వాట్సాప్ యంత్రాంగం కూడా విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *