ఆస్ర్టేలియా గడ్డపై టీమిండియా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవల టెస్టు సిరీస్‌ని దక్కించుకున్న కోహ్లి సేన, తాజాగా వన్డే సిరీస్‌ని గెలిచి చరిత్ర సృష్టించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆతిథ్య జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్‌. దీంతో ఆసీస్‌పై 2-1 తేడాతో నెగ్గి.. తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ని చేజిక్కించుకుంది.

టూర్ ఆరంభంలో ట్వంటీ-20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత జట్టు.. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. తాజాగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విజయం సాధించింది. చివరకు ఆసీస్ టూర్‌ని విజయవంతంగా ముగించింది టీమిండియా.

సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరి వన్డే మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరిగింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే టీమిండియా బౌలర్ భువనేశ్వర్ పదునైన బంతులతో ఆసీస్‌పై ఎటాక్ చేయడం మొదలుపెట్టాడు. కేవలం 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే మరో ఓపెనర్ కూడా భువనేశ్వర్‌ బంతికి బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆటగాళ్లు మరో వికెట్ పడకుండా జట్టు స్కోర్‌ను 100 పరుగులకు చేర్చారు. వెంటనే రంగంలోకి దిగిన చాహల్.. తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు. స్కోరు 200 పరుగులకు చేరుకునేసరికి ఐదు వికెట్లను కోల్పోయింది. 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఆసీస్. 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు చాహల్.

231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఓపెనర్లు రోహిత్- శిఖర్ ధావన్‌లు తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లి- మాజీ కెప్టెన్ ధోనీలు ఆసీస్ బౌలింగ్‌ని ఉతికి ఆరేశారు. విరాట్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ధోనికి తోడుగా వచ్చాడు జాదవ్. ఈ జోడిని విడగొట్టేందుకు కంగారూలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బౌలర్లను పదపదే మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. మైదానం నలువైపులా బౌండరీలతో అలరించారు ఆటగాళ్లు. 49.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించినట్లైంది.

ఈ సిరీస్‌‌లో ధోనీ కీలకపాత్ర పోషించాడు. ఆడిన మూడు వన్డేల్లో, మూడు అర్థశతకాలు సాధించాడు. ఈ సిరీస్‌ తర్వాత ధోనీ రిటైర్ అవ్వాలంటూ కామెంట్ చేస్తున్నవాళ్ల నోళ్లు మూయించాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు ధోనీ. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్, ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. బయట ఎవరెవరో ఎన్నో అంటుంటారని, మాకు వ్యక్తిగతంగా ధోనీ గురించి తెలుసు.. జట్టు పట్ల అందరికంటే ఎక్కువగా అతను నిబద్దతగా ఉంటాడన్నాడు. అతనికి మనం స్వేచ్ఛనివ్వాలి .. భారత జట్టుకు అతనెంతో సేవ చేశాడు. అతను అందరికంటే ఇంటెలిజెంట్ క్రికెటర్.. జట్టుగా తాము చాలా బ్యాలెన్స్‌గా ఉన్నామని, ప్రపంచకప్‌కి ముందు ఇది ఓ మంచి సంకేతం అని కోహ్లీ తెలిపాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *