బీజేపీలో మళ్లీ టెన్షన్, మోదీ డ్రీమ్‌టీమ్‌లో సెకండ్ వికెట్

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీలో టెన్షన్ మొదలైంది. తాజాగా మోదీ టీమ్ నుంచి మరొకరు డ్రాపయ్యారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వచ్చే ఏడాది రిజర్వు బ్యాంకు ఛైర్మన్‌ పదవి ఖాళీ అవుతుందని తెలిసినా ఆయన ఆసక్తి చూపలేదని సమాచారం. వ్యక్తిగత కుటుంబ కారణాలు చెప్పి ఆయన పదవికి రాజీనామా చేశారు. నీతి ఆయోగ్‌ ఉపాథ్యక్షుడు అరవింద్‌ పనగడియా తరువాత ఓ ఉన్నతశ్రేణి ఆర్థిక నిపుణుడు ఇలా రాజీనామా చేయడం ఆర్థికవర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ సంచలనం రేపింది.

ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక.. 2014, అక్టోబరు 16న ఆర్థిక మంత్రిత్వశాఖలో మూడేళ్ల కాలానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్‌‌ను నియమించారు. 2017లో పదవీకాలం ముగియగా మరో ఏడాది పొడిగించారు. ఆయన పదవీకాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలల గడువుంది. ఈలోగానే ఆయన తన పదవికి రిజైన్ చేశారు. మంచి జ్ఞాపకాలతో అమెరికా వెళ్తానని, భవిష్యత్తులో దేశానికి సేవలు చేసేందుకు సిద్ధంగా వుంటానని రెండు ముక్కల్లో తేల్చేశారు సుబ్రమణియన్. వున్నట్లుండి ఆయన రాజీనామా చేయడంతో బీజేపీలో కలవరం మొదలైంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌కు అరవింద్‌ సుబ్రమణియన్‌ క్లోజ్‌ఫ్రెండ్. ఆర్బీఐ నుంచి రాజన్‌ తప్పుకున్నాక, ఆయన వెంటే అరవింద్‌ కూడా వెళ్లిపోవాలని భావించారు‌. కాకపోతే ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ రిక్వెస్ట్‌తో ఆయన అప్పట్లో తన ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇటీవలికాలంలో మోదీ సర్కార్ తీసుకుంటున్న ఆర్థిక విధానాలే ఈ వరుస రాజీనామాలకు కారణమని తెలుస్తోంది.

మరోవైపు మోదీ టీమ్ నుంచి అరవింద్‌ సుబ్రమణియన్‌ తప్పుకోవడాన్ని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌‌గాంధీ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్‌ని గదిలో బంధించేశారని, భారత ఆర్థిక వ్యవస్థ తాళాలు బీజేపీ కోశాధికారి చేతిలో ఉన్నాయని, మునిగేనౌకను విడిచిపెట్టి నిపుణులు పారిపోతున్నారని రాసుకొచ్చారు.