టీపీసీసీ బాహుబలి.. ఇతడే!

తెలంగాణలో సైరా అంటూ హుంకరించనుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ఏడాది ముంచుకొచ్చేయడంతో.. సంస్థాగతంగా కూడా పార్టీని పటిష్టపరిచేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైనట్లు సంకేతాలొచ్చేశాయి. ముందే అనుకున్నట్టు తెలంగాణ పీసీసీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం దాదాపు ఖరారైంది. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాల్ని సమతుల్యం చేస్తూ వీళ్ళ ఎంపిక జరిగిందట! రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క పేర్లు ఫిక్స్ చేసినట్లు, మార్చి ఒకటిరెండు వారాల్లో ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. పాదయాత్రలు గట్రా చేస్తూ పార్టీని పటిష్టపరిచేలా ఈ ముగ్గురికీ.. ప్రచార బాధ్యతలు అప్పగించనుంది హైకమాండ్.

ఈనెల 26 నుంచి జరిగే బస్సు యాత్ర ఏర్పాట్లలో ఇప్పటికే బిజీగా వున్నాయి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోగా బస్సుయాత్ర ముగించాలని ప్లాన్ చేసింది టీపీసీసీ. జూన్ 2న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. రాహుల్ గాంధీ చీఫ్ గెస్టుగా పిలిచే అవకాశం వుంది. ఏదేమైనా.. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ల పర్యవేక్షణలో తెలంగాణ కాంగ్రెస్ ‘బలపరీక్ష’కు సిద్ధం కానుంది. కేసీఆర్ సర్కార్ ని ఢీకొడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సమీకరించడంలో ‘రేవంత్’ మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి!