హరీష్ కారు మీద 'రాళ్ళ దాడి'

తెరాసలో అసంతృప్త నేతలంతా కూటమి కడుతున్నారని.. దానికి మంత్రి, సీఎం మేనల్లుడు హరీష్ రావు నేతృత్వం వహించబోతున్నారని ఎక్కడో పుట్టిన ఒక వార్త.. రాష్ట్రమంతా పాకేసింది. ప్రగతి భవన్ కి సైతం ఈ సెగ తగలడంతో.. పార్టీ అధిష్టానం ఉలిక్కిపడింది. 40 మంది తెరాస ఎమ్మెల్యేలతో హరీష్ రావు ‘లేచిపోతారని’.. బీజేపీతో లగ్గం కుదుర్చుకుంటారని లౌడ్ స్పీకర్లు రొద పెడ్తుంటే.. వాటిని స్విచ్ఛాఫ్ చేసిరమ్మంటూ తన్నీరు హరీష్ రావుకి ఆదేశాలందినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. ఆయన మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టేశారు. నామీదే ప్రయోగం చేస్తారా? అంటూ విలేకరుల మీద రంకెలేశారు. తప్పుడు రాతలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని.. ఈ విషయమై డీజీపీతో కూడా టచ్ లో వున్నానని హెచ్చరించారాయన.

”నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను.. నాకు త్యాగాలే తెలుసు.. ద్రోహాలు తెలీవు.. కేసీఆర్ మాటే నా బాట.. పుట్టుక-చావూ రెండూ తెరాసలోనే” అంటూ తెగేసి చెప్పిన హరీష్ రావు.. ఇలా శీలపరీక్షకు నిలబడ్డం ఇదే మొదటిసారి కాదు. 2009లో కూడా ఆయన పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. టీడీపీలోకి జంపవుతున్నారని.. డీల్ కూడా కుదిరిపోయిందని మీడియాలో గట్టిగా సౌండ్ వినబడింది. అప్పుడైనా.. ఇప్పుడైనా హరీష్ మీద ఇటువంటి ప్రచారం జరగడానికి ఒకటే కారణం.. కేటీఆర్ తో పొసగకపోవడం.. కేటీఆర్ కి ప్రాధాన్యత పెరగడం..! ఇరిగేషన్ లాంటి కీలక పోర్ట్ ఫోలియో ఇచ్చి కొడుకు-కూతురితో పాటు మేనల్లుడికీ సమన్యాయం జరిగేలా చూసినప్పటికీ.. కేసీఆర్ మీదున్న ఈ ‘అపవాదు’ మాత్రం చెరిగిపోలేదు.

కేసీయార్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారీ శత్రుపక్ష మీడియాకు ‘హరీష్ రావు అసమ్మతి’ మాత్రమే ఆయుధంగా దొరుకుతోందని గులాబీ శ్రేణులు గొణుక్కుంటాయి. హరీష్ రావుతో పాటు.. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మీద సైతం అసమ్మతి వార్తలు నిరంతరం వస్తూనే ఉంటాయి. తాజాగా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి తరలిపోతున్నారు. రాష్ట్రంలో కారు స్టీరింగ్‌ని కేటీఆర్ చేతికిచ్చే చాన్సులే ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో జనం దృష్టి హరీష్ రావు మీదకు మళ్లడం సహజం. కొడుక్కు అడ్డు తొలగించడం కోసం హరీష్ ను కూడా కేసీయార్ ఢిల్లీ ‘తీసుకెళ్తారన్న’ ఊహాగానాలూ వినబడ్డాయి. రెండు కత్తుల్ని ఒకే ఒరలో పెట్టి తాను మాత్రం చక్కా ఢిల్లీ చెక్కెయ్యకూడదన్నది కేసీఆర్ ఆలోచన కావొచ్చు. అయితే.. కేవలం గాలి మాటల్నే ఆధారంగా చేసుకుని.. కోడిగుడ్డుపై మరిన్ని ఈకలు తగిలించి వార్తలు రాయడం సమంజసం కాదని.. మీడియా కూడా మనసుపెట్టి వ్యవహరించాలని హరీష్ రావు ‘వేడుకున్నంత’ పని చేశారు. అంతమాత్రం చేత ‘కేసీఆర్ కుటుంబాన్ని’ సోషల్ మీడియా ఊరికే వదిలిపెడ్తుందా? ఈ ‘రాళ్ల దాడి’ ఇక్కడితో ఆగుతుందా?