దాదాపు నాలుగేళ్లుగా అధికార, విపక్షపార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు, పోరాటాలు, పాలనపై నేడు తెలంగాణ ఓటరు తన స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నాడు. ప్రజాస్వామ్యదేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల క్రతువు నేడు చరమాంకానికి చేరుకుంది. ఓటరు దేవుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు దాదాపు ఏడాదిపాటు నేతలు సాగించిన దీక్షలకు ఫలితం లభించేరోజిది. తెలంగాణలోని 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును ఇవాళ (శుక్రవారం) వినియోగించుకోనున్నారు. వారుఎలాంటి తీర్పు ఇచ్చారన్నది తేలాలంటే మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు వరకు వేచి ఉండాల్సిందే.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 1,821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఎన్నికల్లో 63 సీట్లను సాధించి, శాసనసభ రద్దయ్యే నాటికి 86కు తన బలాన్ని పెంచుకున్న టీఆర్ఎస్ మళ్లీ అధికారంకోసం తొలిసారిగా రాష్ట్రంలోని 119 స్థానాలకూ పోటీ చేస్తోంది. ఇక ప్రజాకూటమిగా కాంగ్రెస్‌ 99 స్థానాలకు, టీడీపీ 13 స్థానాలకు, తెలంగాణ జనసమితి 8, సీపీఐ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఈసారి 118 స్థానాలకు.. సీపీఎం సారథ్యంలోని బీఎల్‌ఎఫ్‌ 119 స్థానాలకు బరిలో నిలిచాయి. ఇక, ప్రధాన పార్టీల టికెట్లు ఆశించి దక్కని నేతల్లో కొంతమంది బీఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం తమ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇక మల్కాజిగిరి బరిలో 42 మంది అత్యధికంగా పోటీలో ఉంటే, బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు బరిలో ఉన్నారు.

119 శాసనసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో అధికార పీఠం దక్కాలంటే 60 సీట్ల మ్యాజిక్‌ సంఖ్యను దాటాల్సిందే. ఇవాళ ఒక ప్రతి ఓటరూ ఒక సైనికుడై భావి తెలంగాణ నిర్మాణానికి ఇటుకలు పేర్చాల్సిందే. ప్రతీ ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. 1890 నాటికి ఈ భూగోళంపై ఓటు హక్కున్న దేశం ఒక్కటీ లేదు. ఇప్పుడు.. మెత్తం 192 దేశాలకు గాను 124 దేశాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఓటరు మహాశయుడే తన ప్రభుత్వాన్ని ఎంచుకుని కింగ్ మేకర్ అవుతున్నాడు. ఓటు హక్కు తప్పక వినియోగించుకోండి.

ఇక, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉదయం 7గంటలనుంచి ఓటింగ్ ప్రారంభమైంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున క్యూలో నిల్చుని ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అటు, నేతలు సైతం క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *