ఎన్నికల వేళ తాజాగా నిర్వహించిన టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ లో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోబోతోందని.. అదే సమయంలో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తుందని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం మొత్తం ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ సీట్లను గెలుస్తుందని.. టీడీపీ కేవలం మూడంటే మూడు సీట్లకే పరిమితమవుతుందని చెప్పుకొచ్చింది.

జగన్ పార్టీకి 48.80 శాతం మంది సపోర్ట్ ఉంటుందని.. టీడీపీకి 38.40 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. ఇదే సంస్థ జనవరిలో నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇదే ఫలితాల్ని వెలువరించింది. ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీ 23 సీట్ల, అధికార టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అవుతుందని అప్పట్లో చెప్పింది. ఇక, 2014లో టీడీపీ 15 ఎంపీ స్థానాలను సొంతం చేసుకోగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను, బీజేపీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. తాజా లెక్కలబట్టిచూస్తే, వైఎస్ జగన్ భారీ సంఖ్యలో సీట్లను గెలవడం ద్వారా ఎన్డీయే లేదా థర్డ్ ఫ్రంట్ కూటమిల ప్రభుత్వ ఏర్పాటుకు బాగా ఉపకరిస్తుందని టైమ్స్ నౌ సర్వే సంస్థ అభిప్రాయపడింది.

ఇక, తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో.. టీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొందుతుందని.. బీజేపీ రెండు ఎంపీ సీట్లు, కాంగ్రెస్ 1, ఇతరులు ఒకస్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. టీఆర్ఎస్‌కు 41.20 శాతం ఓట్లు వస్తాయని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *