బ్రెజిల్‌లో ఇదో అద్భుతం.. వైద్య చరిత్రలోనే అసాధారణం. చనిపోయిన మహిళ నుంచి సేకరించిన గర్భసంచి (యుటిరస్)‌ను 32 ఏళ్ళ మరో మహిళకు అమర్చి సక్సెస్ అయ్యారు అక్కడి డాక్టర్లు. అంతేకాదు..ఈమెకు పండంటి బేబీ జన్మించింది కూడా. జన్యులోపం కారణంగా పుట్టుకతోనే ఈమెకు  గర్భసంచి లేదు. నాలుగున్నర వేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ‘ మేయర్-రాకిటాన్స్ కీ-కస్టర్-హాసర్ ‘ అనే సిండ్రోమ్ కారణంగా ఈమె వంధ్యత్వంతో బాధ పడుతూ వచ్చింది. తల్లి అయ్యే అవకాశం లేకపోయింది.కానీ తాను తల్లిని కావాలనుకుంటున్నానని ఆమె డాక్టర్లను సంప్రదించింది.
ఈ  మహిళ మెడికల్ హిస్టరీని సవాలుగా తీసుకున్న వారు..మరణించిన ఓ 45 మహిళ నుంచి సేకరించిన యుటిరస్ ను ఈమెకు అమర్చారు. 2016 లో ఈ మహిళకు 11 గంటల పాటు సుదీర్ఘమైన ఆపరేషన్ జరిగింది. అది విజయవంతమైంది. ఇది జరిగిన 37 రోజుల అనంతరం ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017 లో గర్భం దాల్చిన ఈమె అదే ఏడాది డిసెంబరు 15 న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డాక్టర్లు ఆమె నుంచి బిడ్డను వేరు చేశారు. పుట్టినప్పుడు రెండున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువు పెరిగింది.
మరణించిన మహిళ తన గుండెను, లివర్, కిడ్నీలను కూడా దానం చేసినప్పటికీ వాటిని వైద్యులు ఎవరికైనా అమర్చారా అన్నది తెలియలేదు. ఏది ఏమైనా..మృతురాలైన మహిళ గర్భసంచిని మరో లేడీకి మార్పిడి చేయడం, ఈమె గర్భం దాల్చి ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు జన్మనివ్వడం వైద్య చరిత్రలో జరిగిన అనూహ్య పరిణామమని సావో పాలో యూనివర్సిటీ డాక్టర్లు అంటున్నారు. ఇంతకీ ఈ బేబీకి తల్లి ఎవరన్నది  సస్పెన్స్ గా మారింది.  ఈ ఆపరేషన్  విజయవంతం కావడంతో..సంతాన లేమితో బాధ పడే లక్షలాది మహిళలకు ఇది వరం కానుందని భావిస్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *