శారీరక సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యమే మిన్న. ఈ మాట చెప్పుకోడానికి బాగుండొచ్చు. ఆచరణలో మాత్రం అందరూ అట్టర్ ప్లాపే! అవతలివాళ్ళలో శారీరక లోపం కనిపించగానే ఒకరకమైన ఏహ్యభావం పెంచుకోవడం.. గేలి చేయడం లాంటి స్వభావం చాలామందిలో కనిపిస్తుంది. భిన్నమైన ప్రొఫెషన్స్‌లో ఉంటూ, సోషల్ లైఫ్‌లో చురుగ్గా వ్యవహరించే మహిళలకు ఈ తాకిడి మరీ ఎక్కువ. సహజంగానో, జన్యుపరంగానో ప్రాప్తించే ఊబకాయంతో వాళ్ళు సోషల్ మీడియాలో పడే ఇబ్బందులపై ఒక వార్తా సంస్థ దృష్టి పెట్టింది. మచ్చుకు కొందరిని కలిసి.. వాళ్ళ మనోభావాల గురించి, ఈ ఇరకాటం నుంచి వాళ్ళు బైటపడ్తున్న తీరు గురించి ఆరా తీసింది. నిశ్శబ్దంగా ‘బాడీ-పాజిటివ్’ అనే ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని, ‘మీ శరీరాన్ని మీరు అభిమానించండి’ అనే పిలుపుతో దూసుకెళ్తున్నవాళ్ళే వీళ్ళంతా!

లారా డెలరాటో- సెక్స్ ఎడ్యుకేటర్, రచయిత
”వరుస ట్రోల్స్ తో వేధించేవారు. సోషల్ మీడియా నుంచి ఎన్నోసార్లు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. నేను ఊబకాయాన్ని ప్రమోట్ చేస్తున్నానట. ఆడతనాన్ని భ్రష్టుపట్టిస్తున్నానట. ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. కానీ.. ఈ డిప్రెషన్ నుంచి తప్పుకోవడం కోసం నాలోని ఆర్ట్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్‌ ని వాడుకుంటూ మరోవిధంగా ఎదగడానికి ప్రయత్నించా..!”

లా షానా స్టీవార్డ్- మోడల్
”నా స్కూల్ ఏజ్ నుంచి ఆన్‌లైన్ ట్రోలర్స్‌తో ఇబ్బంది పడేదాన్ని. వయసు పెరిగేకొద్దీ.. ఈ ‘వేధింపుల’ వల్ల నాకు మంచే జరిగింది. పెద్ద మోడల్‌గా ఎదగడానికి దోహదపడింది. నన్ను ఎగతాళి చేసినవాళ్లంతా ఇప్పుడు నన్ను చూసి ఈర్ష్య పడుతున్నారు. కాకపోతే.. నా పేరు గూగుల్‌లో సెర్చ్ చెయ్యడానికి ఇప్పటికీ నాకు భయమేస్తోంది. లావైన నా శరీరంతో ఆన్లైన్లో ఎన్నెన్ని ఆటలో..”

జేన్ బెల్ ఫ్రై – క్రియేటివ్ డైరెక్టర్ (ది థిక్)
”ఆడదానికి.. మరీ ముఖ్యంగా ఇంటర్నెట్‌లో ఆడదానికి బతుకంతా దుర్భరమే. గేలి చేసే వాళ్లకు ఇక దొరక్కూడదనుకుని.. పర్సనల్ ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్ని ఏర్పాటు చేసుకుని.. నాలాంటి బాధితులందరినీ ఏకం చేశా. The Thicc అనే ఒక ఆన్లైన్ డయాస్ మీద ఒకరి శరీర కష్టాల్ని మరొకరు పంచుకోవడం మొదలుపెట్టాం. ఇంతకంటే మరో దారెక్కడ?”

లిజ్ బ్లాక్- రైటర్ & బ్లాగర్
”సంతోషంగా వుండాలనుకున్నవాళ్ళు, ఆత్మాభిమానం వున్నవాళ్లు ఎప్పుడూ మరొకరిని బాధపెట్టరు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. ఎవ్వరినుంచైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఊహించుకుని జాలిపడేదాన్ని. డిలీట్ చేయడమో, బ్లాక్ చేయడమో.. ఎలాగోలా ముందుకు పోయేదాన్ని. అంతేతప్ప నొచ్చుకునేదాన్ని కాదు. ఇదే నాకు ఆత్మబలాన్నిస్తోంది.”

సారా చివయా- ఎడిటర్ అండ్ బ్లాగర్
”నా గురించి నేనెప్పుడూ సిగ్గుపడేదాన్ని కాదు. ఆన్లైన్లో ఉన్నామంటే దేనికైనా మానసికంగా సిద్ధపడక తప్పదు. ప్లస్-సైజున్న మహిళలు కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా, స్టైలిష్‌గా, హ్యాపీగా ఉండడాన్ని చూసి నేను స్ఫూర్తి పొందా. ఆ తర్వాతే ఈ బ్లాగ్ మొదలుపెట్టి.. మనల్ని మనం ఎంతగా రిప్రెజెంట్ చేసుకోగలం అనేదాని మీదే దృష్టి పెట్టా..”

ఫెలిసిటీ హేవార్డ్- మోడల్, సామజిక కార్యకర్త
”మనలాంటి వాళ్ళు చింతించాల్సిన అవసరమే లేదు. మనల్ని మనం జడ్జ్ చేసుకునే సామర్థ్యం మనకుండాలి. నీ మీద నీకు విశ్వాసం వున్నప్పుడు.. నెగిటివిటీ మీద పోరాడ్డం సులభమవుతుంది. అవతలివాళ్ళ అభద్రతాభావాన్నే మనం ఆయుధంగా చేసుకోవాలి”

కెల్లీ అగస్టీన్- మోడల్ అండ్ బ్లాగర్
”నాకు సంబంధించిన, నాకు ఇష్టమైన ఫొటోల్ని పోస్ట్ చేయడానికి నేనేమీ సంకోచపడను. ఎందుకంటే.. ఇదేమీ తప్పు కాదన్న క్లారిటీ నాకుంది. పైగా దీంతో.. నాలాంటి మిగతా వాళ్లకు దీంతో ఉపయోగం ఉంటోంది. అందుకే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తాను.”

కేవలం శరీర స్వభావాన్ని బట్టి వివక్ష చూపే సమాజంతోనే వీళ్లందరి పోరాటం. ఎదురీతలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ తమకున్న ‘వెలితిని’ వెలితిగా భావించకుండా.. ఆ బలహీనతనే బలంగా మార్చుకుని పోరాడి సోషల్ మీడియా మీద విజేతలుగా నిలబడ్డ ఆధునిక వనితలు వీళ్ళు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *