అది అమెరికాలోని కొలరాడోలో గల ఎత్తయిన కొండ ప్రాంతం ‘ ఫోర్ట్ కొలిన్స్ ‘… నిర్మానుష్యంగా, గుట్టలు, దట్టమైన పొదలు, చెట్లతో ఉండే ‘ అడవి ‘ లాంటి ఆ ఫోర్ట్ వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడరు. కారణం ? అది క్రూర మృగాలకు ఆలవాలం.. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సంచరించే మౌంటైన్ లయన్‌లు అక్కడ తచ్చాడుతుంటాయి.

అతి ప్రమాదకరమైన ఈ సింహాల దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఈ నెల 4 న ఎలా వెళ్ళాడో గానీ.. 31 ఏళ్ళ ట్రెవిస్ కఫ్‌మన్ అనే వ్యక్తి ఆ గుట్టల ప్రాంతానికి వెళ్ళాడు. ఏమరుపాటుగా నడుస్తున్న అతనిపై ఒక్కసారిగా ఓ సింహం దూసుకొచ్చి దాడి చేసింది. అయితే క్షణంలోనే తేరుకున్న ట్రెవిస్..భయపడలేదు.

ఆ మౌంటైన్ లయన్ తో తీవ్రంగా పోరాడాడు. దాని ఎటాక్ లో ఇతని ముఖం, మెడ, కాళ్ళు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అయినా రక్తమోడుతున్నప్పటికీ.. అతగాడు దాన్ని దీటుగా ఎదుర్కొన్నాడు. చివరకు ఆ సింహం మెడపై తన కాళ్ళను గట్టిగా అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు.

అది మరణించాక తన గాయాలవల్ల చాలాసేపు అక్కడే కదలలేక ఉండిపోయాడట. చివరకు ఎలా తెలిసిందో అటవీ అధికారులకు ఈ విషయం తెలిసి వెంటనే వచ్చి ట్రెవిస్ ని ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో ఇతనికి 20 కుట్లు పడ్డాయి. అధికారుల సూచనపై ట్రెవిస్ ఇటీవల మీడియాకు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ రోజున జరిగిన తన షాకింగ్ అనుభవాలను వివరించాడు. ఆ సింహం దాడి నెదుర్కొని గాయాల పాలైనా..ప్రాణాపాయం నుంచి బయటపడడం తన అదృష్టమేనన్నాడు. కాస్త కోలుకున్నాక..అతగాడు.. అటవీ అధికారులను, సిబ్బందిని వెంటబెట్టుకుని..తనకు.. ఆ క్రూర మృగానికి జరిగిన ‘ ఫైట్ ‘ ప్రాంతాన్ని చూపాడు. అధికారులతో బాటు ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఇతని సాహసాన్ని విని ముచ్చట పడి ప్రశంసలతో ముంచెత్తింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *