అలెగ్జాన్ద్రియా ఒకాసియో కార్టేజ్..! AOC అనే నిక్ నేమ్‌తో పిలిపించుకునే ఈవిడ.. అమెరికన్ కాంగ్రెస్‌లో సభ్యురాలు. డెమొక్రాట్ పార్టీకి చెందిన ఈ ఔత్సాహిక మహిళ టీనేజ్ నుంచీ. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతోంది. ఒబామా ప్రెసిండెంట్‌గా వున్నప్పుడే.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అమెరికన్ యూత్ ఐకాన్‌గా పేరు పొందింది. ఇప్పుడీమె.. ‘ఫ్యూచర్ అమెరికా’పై తనవైన కొన్ని బంగారు కలల్ని కంటోంది. ఆమేరకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది.

గురువారం అమెరికన్ కాంగ్రెస్‌లో ఒకాసియో కార్టేజ్ ప్రతిపాదించబోయిన ‘గ్రీన్ న్యూ డీల్’ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం వింతగా మాట్లాడుకుంటోంది. ”కార్లు, విమానాలు లేని అమెరికాను సాధించుకుందాం. మరో పదేళ్లలో అమెరికాలోని ప్రతి భవనాన్ని ఎకో ఫ్రెండ్లి బిల్డింగ్‌గా మార్చి చూపెడదాం” అంటూ ఆమె రాసుకొచ్చిన యాక్షన్ ప్లాన్ మీద ఆ దేశంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాలుష్య పూరిత వాయువుల్ని వదిలే ఆవులతో మొదలుపెట్టి, ఇంధనంతో నడిచే ఏరోప్లేన్స్ దాకా అన్నిటినీ నిర్మూలించుకుంటూ వెళితే తప్ప.. అమెరికాతో పాటు ప్రపంచ భవిష్యత్తు ఆరోగ్యకరంగా మారదన్నది ఆమె అభిమతం. ఈ పనులన్నిటి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు 4.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతుందంటున్న AOC.. పని చేయడానికి సుముఖంగా లేని సిటిజన్లకు కనీస ఆదాయ కల్పన పథకం కూడా తన దగ్గరుందని చెబుతోంది.

ఒకాసియో కార్టేజ్ ప్రపోజ్ చేసిన ‘గ్రీన్ న్యూ డీల్’ పట్ల హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి పెదవి విరిచారు. దీని గురించి ప్రజల్లో నమ్మకం కల్పించడం కష్టమంటూ కొట్టిపారేశారామె. అంతకుముందు.. సభాపతి పెలోసీ ఏర్పాటు చేసిన ‘క్లయిమేట్ చేంజ్ కమిటీ’లో ఒకాసియో కార్టేజ్‌కి కనీసం చోటు కల్పించకపోవడం గమనార్హం. చేసేది లేక.. సభ వెలుపల ప్రెస్‌మీట్ పెట్టి తన ‘గ్రీన్ న్యూ డీల్’ని అనౌన్స్ చేశారు ఒకాసియో కార్టేజ్. తక్కువ ఉద్గారాల్ని బైటికొదిలే హైస్పీడ్ రైళ్ల కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరం అవుతాయని, కోట్లాది ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కూడా ఆచరణ సాధ్యం కాదని రిపబ్లికన్లు అభ్యంతరాలు లేవనెత్తారు.

AOC రాసుకొచ్చిన ‘గ్రీన్ న్యూ డీల్’ ఒక వజ్రాయుధమని, అమెరికాకు రక్షణ కవచం లాంటిదని కొన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయి. పదేళ్ల తన ప్రణాళిక ద్వారా సంపూర్ణ పర్యావరణ పరిరక్షణ సాధించడంతో పాటు.. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభాన్ని కూడా నివారించవచ్చని ఆమె బల్లగుద్ది చెబుతున్నారు. అటు.. అమెరికన్ కాంగ్రెస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్ ఎన్ఫోర్స్‌మెంట్ నిధుల్లో కోత పెట్టడం, సరిహద్దుల్లోని జైళ్లలో కనీస వసతుల కల్పన కోసం ఫండ్స్ జారీ చేయకపోవడం లాంటి అంశాలపై ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది. ఏదైతేనేం.. అమెరికన్ సమాజం పట్ల తనకున్న అంకిత భావం ద్వారా.. డెమొక్రటిక్ పార్టీ సోషలిస్ట్ విభాగానికి ఒకాసియో కార్టేజ్.. ఒక డార్లింగ్‌గా మారిపోయింది. అమెరికన్ క్లయిమేట్ పాలిటిక్స్ లో సరికొత్త శకానికి ఒకాసియో కార్టేజ్ నాందీవాచకం లాంటిదట! చూద్దాం.. ఈమెగారి ‘గ్రీన్ డ్రీమ్’ సాకారమవుతుందో లేక బద్దలవుతుందో?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *