పోలింగ్ తేదీకి, ఫలితాల వెల్లడికి మధ్య ఆ గ్యాప్.. ఎటువంటి ఫీలింగ్‌నిస్తుందనేది పొలిటికల్ లీడర్లకు మాత్రమే ఎరుక. ఆ రెండుమూడు రోజులూ నిప్పుల మీద కూర్చున్నట్లే ఉంటుంది వాళ్లకు ! ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తంతు అంచనాల్ని మించి ఉత్కంఠను రేపింది. ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత.. ఆ ఉత్కంఠ రెండింతలైంది. గాలి ఎటువైపు వీచిందన్న క్లారిటీ ఇప్పటికీ రాకపోవడంతో అన్ని వర్గాల్లోనూ నరాలు తెగిపోయ్యేంత సస్పెన్స్.

జాతీయ ఛానెళ్ల సర్వేల్ని పట్టుకుని టీఆరెస్.. లగడపాటి లెక్కల్ని జేబుల్లో పెట్టుకుని ప్రజాకూటమి.. హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇలా భిన్నమైన సర్వేలు రావడం ఒకందుకు మంచిదే అయ్యింది. ఎవరి ధీమాల్ని వారు ప్రకటించుకుంటూ శనివారం రోజు మరోసారి టీవీల్లో మెరిశారు. తెల్లారగానే.. మైకందుకున్న మొదటి వ్యక్తి తెలంగాణ రెబల్ స్టార్ రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మీట్ ది ప్రెస్ పెట్టుకుని.. ఏకంగా రెండు గంటలపాటు ‘దంచికొట్టాడు’ రేవంత్. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బొంద పెట్టినట్లేనని తెల్చేశారు. ప్రభుత్వం మీద అంత ఎత్తున వ్యతిరేకత వుంది కనుకే బద్ధశత్రు పార్టీలైన టీడీపీ-కాంగ్రెస్ కూటమిని జనం స్వాగతించారన్నారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి, కేటీఆర్ అమెరికాకి వెళ్లిపోవడం ఖాయమన్న రేవంత్.. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయన్న రేంజ్‌లో స్పందించడం.. అక్కడున్న మీడియా మిత్రులని ఆశ్చర్యపరిచింది. 11వ తేదీ మధ్యాహ్నం కోసం రాసిపెట్టుకున్న స్క్రిప్ట్‌ని ఇప్పుడే చదివేశారంటూ చురకలు పడ్డాయి. ఫలితాల రోజు ఇలా మాట్లాడే ‘అవకాశం’ వస్తుందో రాదో అనే అనుమానంతోనే రేవంత్.. ఇలా ప్రెస్‌మీట్ పెట్టి ‘తృప్తి’ పడ్డారని చెప్పుకున్నారు. మధ్యాహ్నం కూటమి పక్షాలు కూడా మీడియా ముందుకొచ్చేశాయి. కాంగ్రెస్‌లో ‘నేనే నంబర్1’ అనే ఫీల్ కలిగించే ప్రయత్నంలోనే రేవంత్ ముందస్తు ప్రెస్‌మీట్ పెట్టారన్నది గాంధీభవన్లో పుట్టిన మరో సందేహం.

కేసీఆర్ కోస్గి సభ సమయంలో రేవంత్ అరెస్ట్ కావడం, మద్దతుగా రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేయడం .. అరెస్ట్ ఎపిసోడ్ కారణంగా కోర్టు నుంచి పోలీసులకు అక్షింతలు పడ్డం.. లాంటి పరిణామాలన్నీ రేవంత్ వెయిట్ పెంచేశాయి. ఈ హైప్ ని కంటిన్యూ చేసుకోవాలన్నది ఆయన స్ట్రాటజీ. కానీ.. రేవంత్ ఒక్కడే పోటుగాడా.. అనే పంచ్ డైలాగులు తెలంగాణ కాంగ్రెస్ లో ఆరోజే వినిపించాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం మీద అంతర్గతంగా వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. రాబోయే రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ‘రేవంత్-యాంటీ రేవంత్’ సౌండ్స్ మరింత బిగ్గరగా వినిపించే ఛాన్సుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *