పొదుపు అనేది ఆర్ధిక భవిష్యత్తుల్ని నిర్దేశించే కీలక మంత్రం. ఒక మనిషి అయినా, ఒక వ్యవస్థ అయినా పొదుపు చర్యలు పాటించకుంటే.. ప్రతిఫలం అనుభవించక తప్పదన్నది పెద్దపెద్ద ఆర్ధికవేత్తలే చెప్పే సూక్ష్మం. ‘ఖర్చు చెయ్యడం’ అనే వ్యాధి నుంచి మనల్ని మనం ఎలా బైటపడెయ్యాలి, అదుపు తప్పి ఖర్చులు చేసే అలవాటును ఎలా మాన్పించాలి అనే అంశం మీద పరిశోధన చేసిన కొందరు సైకాలజిస్టులు ఐదు సరళమైన నియమాల్ని రూపొందించారు. ఏమిటవి..?

  • ఒక వస్తువును కొనుగోలు చేయాలనో, ఒక రెస్టారెంట్‌కి వెళ్లి తీరాలనో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకునే ఒక అలవాటు..! ఇది ఖర్చులు పెరగడానికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి. మన తృప్తిని, లేదా మన ఆకలిని కాసేపు ఆపుకుంటే కలిగే ప్రయోజనాల్ని బేరీజు వేసుకోవడానికి కొంత కనీస సమయాన్ని కేటాయించుకోవడం అవసరం. ‘డిలేడ్ రివార్డ్ డిస్కౌంటింగ్’ అనే ఈ స్ట్రాటజీ ద్వారా మనలోని హడావిడి తత్త్వం అదుపులో ఉండడమే కాకుండా, మన క్రెడిట్ కార్డు తంటాలు కూడా కంట్రోల్‌లోకొస్తాయని కాలిఫోర్నియాలోని కార్లా మేరీ మ్యాన్లీ అనే తత్వవేత్త చెబుతోంది.
  • ఎకనామిక్ థియరీలోని ‘కొరత’ నియమం గురించి వినేవుంటారు. సప్లై-డిమాండ్‌ల మధ్య సంబంధాల్ని నిర్దేశించే ఫార్ములా ఇది. ‘ఇప్పుడు మన దగ్గరుండే అతికొద్ది మోతాదు.. భవిష్యత్తులో అతి పెద్ద మోతాదుగా మారవచ్చు’ అన్నది ఈ scarcity మూల సిద్ధాంతం. దీన్ని ఫాలో కావడం ద్వారా.. ఏదైనా వస్తువును అవసరాన్ని మించి ఎక్కువగా కొనాలన్న ఆలోచన నుంచి దూరంగా జరగొచ్చట.
  • తెలిసో తెలీకో ఏదైనా జిమ్‌లో అసాధారణ మొత్తం డబ్బు కట్టి మెంబర్‌షిప్ తీసుకుంటాం. సభ్యత్వం కోసం మనం ఎక్కువ ఖర్చు చేశామన్న జ్ఞానోదయం తర్వాత కలుగుతుంది. ఎలాగూ మెంబర్‌షిప్ తీసుకున్నాం కదా అన్న ఉద్దేశంతో నెలవారీ డ్యూస్ కూడా కట్టుకుంటూ వెళతాం. ఇదొక అమాయకమైన నిర్ణయం అని తెలిసినా చేస్తూనే ఉండడం కొందరి బలహీనత. దీన్నే వాణిజ్య పరిభాషలో Sunk Cost Fallacy అంటారట. కట్టిన రిజిస్ట్రేషన్ డబ్బు తిరిగిరాదని తెలిసినా.. దాన్నుంచి తప్పించుకోలేకపోవడమనేది ఒక వీక్‌నెస్. దాన్నుంచి బైటపడ్డం అవసరం.
  • 50 డాలర్లున్న ఒక వస్తువు ఖరీదును 100 డాలర్లకు పెంచి.. ‘మీకోసం ప్రత్యేకంగా 50 డాలర్లకు మాత్రమే విక్రయిస్తున్నాం.. బంపరాఫర్’ అంటూ కనిపించే ప్రైస్ ట్యాగ్స్ .. ఒక మాయాజాలం. ఇందులోని కమర్షియల్ సీక్రెట్‌ని పసిగట్టడం తెలీని సగటు వినియోగదారుడు.. ‘తాను ఖర్చుపెట్టబోయే 50 డాలర్ల గురించి ఆలోచించడం మానేసి.. తాను మిగిలించబోయే 50 డాలర్ల గురించే ఎక్కువగా ఆలోచించుకుంటాడు. దీన్నే ‘యాంకరింగ్’ థియరీ అంటారట. దాదాపు సగం మంది మధ్యతరగతి జనం ఈ సూక్ష్మం దగ్గరే ‘దొరికిపోయారు’!
  • పరుగుపందెంలో పక్కనున్న పోటీదారుల కంటే వేగంగా పరుగెత్తాలని ప్రయత్నించడం ఎంత సహజమో.. కమర్షియల్ సొసైటీలో కూడా అంతే సహజం. మనం ఖర్చు పెట్టే విధానాన్ని చుట్టూ వుండే సమాజమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వేలంపాట సమయంలో అవతలి వాడి కంటే ముందుండాలన్న చైతన్యం కలిగినట్లే.. స్పెండింగ్ కల్చర్‌లోనూ అంతేనని కన్స్యూమర్ సైకాలజీ చెబుతోంది. అందుకే.. ఎక్కడైనా సరే గానీ.. ఖర్చు దగ్గర మాత్రం ఇతరులతో పోలిక పెట్టుకోవద్దన్నది ‘పొదుపు స్పెషలిస్టుల’ సూచన.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *