బతకడానికి తినాలి గానీ.. తినడానికి బతక్కూడదన్నది ఒకానొక పాత సామెత. కానీ.. ఎంత తింటున్నాం అన్నది కాదు ఏం తింటున్నామన్నది ముఖ్యం.. ఇది కొత్త మాట. అవును.. ఇవ్వాళా రేపూ తినడం అనేది ఒక కళ. ఇందులో గొప్పగొప్పవాళ్లే అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యూరప్ ఖండంలో అయితే.. ‘తెలివితక్కువ తిండి’ అనే అలవాటుతో చచ్చిపోతున్న వాళ్ళు లెక్కలేనంత మంది. ‘వాళ్ళు చావడానికే తింటున్నారు’ అని తేల్చేసింది.. Global Burden of Disease Study.
డైట్ రిలేటెడ్ గుండె జబ్బుల కారణంగా ఒక్క ఏడాదిలో ఏకంగా 6 లక్షల 10 వేల మంది మృత్యువాతన పడ్డారట. మొత్తం 51 దేశాల డేటా బైటికి తీస్తే.. ఇందులో యూకే 42వ స్థానంలో నిలబడింది. ‘ప్రమాదకరమైన తిండి’ విషయంలో ఉజ్బెకిస్థాన్ మోస్ట్ డేంజరస్ అనిపించుకుంటే.. స్పెయిన్, ఇజ్రాయెల్ కూడా ఆ దిశగానే నడుస్తున్నాయి. ఆహారంలో ఉప్పు వినియోగం పెరగడం, సరిపడా కాయగూరలు తినకపోవడం, గింజ ధాన్యాల జోలికే వెళ్ళకపోవడం లాంటి కారణాల్ని గుండెజబ్బులకు దారితీసేవిగా తేల్చేశారు.
ఈ రకమైన అనాకారీ ఆహార పద్ధతుల కారణంగా ప్రతి లక్ష మందిలో కనీసం 62 మంది చనిపోతున్నారట. 2016లో నమోదైన 43 లక్షల మరణాల్లో సగానికి సగం.. ఇలా అవగాహన లేని ఆహారపుటలవాట్ల వల్ల సంభవించినవేనని రీసెర్చర్లు నిర్ధారించారు. నట్స్ అండ్ సీడ్స్ మీద ఇప్పుడిప్పుడే ఆసక్తి కనబరుస్తున్న జనం.. ఆర్గానిక్ ఫుడ్ కల్చర్‌కి అలవాటు పడ్తున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఇలా బ్యాక్ టు బేసిక్స్ అంటూ జాగ్రత్త పడినప్పటికీ.. కొన్ని పాపులేషన్స్లో ఇప్పటికీ ‘తిండి’ పట్ల అలసత్వం, అజాగ్రత్త కనిపిస్తోందంటున్నారు ఎనలిస్టులు. మరి.. గుండె ఆగిపొయ్యేదాకా ఇలాగే తింటుంటారా..? నాలిక పండడం, కడుపు నిండడం మాత్రమే కాదు.. గుండె అనేది కూడా ఒకటుందని గుర్తు పెట్టుకోండి మరి..! ఒక అలెర్ట్ నోటీస్!