ఏటా దాదాపు 8 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. అందులో లక్ష 70 వేల మంది భారతీయులే. ప్రతి గంటకు ఒక విద్యార్థి ప్రాణం తీసుకుంటున్నాడంటే.. మన విద్యార్థిలోకంలో ఎటువంటి నిర్వేదం అలముకుందో అర్థమవుతుంది. మనసు కష్టం చేసుకుని తనువు చాలించడమనే ఈ జాడ్యం నిర్మూలన కోసం ఎన్నో రకాలైన సామాజిక ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేదు. ఆత్మహత్య అనే ఆలోచనే దుర్మార్గం అన్నది మనిషిలో రావాల్సిన అసలైన పరివర్తన. కానీ.. ఆత్మహత్యకు పాల్పడేవారి దృక్పధాన్ని ఆఖరి నిమిషాల్లో కూడా చిన్నపాటి టెక్నిక్స్ ద్వారా మార్చిపడెయ్యొచ్చన్నది కొందరు నిపుణుల సలహా.

1. హోప్ బాక్స్..!

జీవితకాలపు జ్ఞాపకాలతో కూడిన అరుదైన ఆశల పెట్టె..! ఇష్టమైన వాళ్ళ ఫోటోలు, తాము కష్టపడి సాధించిన సర్టిఫికెట్లు, తమ ఆరాధ్యులెవరైనా వాడే పర్‌ఫ్యూమ్ బాటిల్.. ఇటువంటివన్నీ కలిపి ఒక చోట దాచిపెట్టుకోవడం అనేది మంచిదట. డైరీ రాసుకునే అలవాటు లాంటిదే ఇది కూడా. ఎపుడైనా మానసిక ఒత్తిడి కలిగి చనిపోదామన్న ఆలోచన కలిగినప్పుడు.. అటువంటి తీవ్రమైన బాధ నుంచి బయటపడాలంటే.. ఈ హోప్ బాక్స్  తెరిస్తే చాలు. పాత ఫోటోలు కాసేపు తిరగేసినా చాలు. ఆ అత్తరు తీసి కొద్దిగా వంటిమీద పూసుకున్నా చాలు. బతుకు మీద ఆశలు చిగురిస్తాయట.


2. బలమైన ఊపిరి

ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నదన్న భావనను శ్వాసతో సరిచెయ్యొచ్చట. లాంగ్ బ్రెత్ అనేది మానసిక దారుఢ్యం కలిగించే ఒక అరుదైన ప్రక్రియ. నిదానంగా శ్వాస పీల్చడం.. అరక్షణం సేపు ఆగి మళ్ళీ వదలడం..! ఇలా చేయడం ద్వారా శ్వాసకోసం శుభ్రపడ్డం మాత్రమే కాకుండా.. స్పష్టమైన శారీరక స్పృహ కలుగుతుంది. మిమ్మల్ని మీకు గుర్తు చేసుకోడానికి, మీతో మీకున్న అవసరాన్ని తెలియజెప్పడానికి ఇదొక దగ్గరిదారి అన్నది నిపుణుల మాట.


3. స్పర్శ జ్ఞానం


తనకు ఏదీ సోకనట్లు, ప్రపంచంలో ఏదీ తనది కాదన్నట్లు అనుభూతి కలిగి మనసు తిమ్మిరెక్కినట్లు తోస్తే.. చావే శరణ్యం అనిపించడం సహజం. ఆ ఫీల్ నుంచి బయటపడాలంటే.. ఏవైనా కొత్త వాసనల్ని ప్రయత్నించండి. దగ్గరున్న వస్తువుల్ని సున్నితంగా తాకుతూ ఆ స్పర్శ నుంచి ఏదైనా గ్రహించగలమేమో చూడండి. ఇలా చేయడం ద్వారా.. మనల్ని మనం వర్తమానంలో నిలబెట్టుకోగలం. తిమ్మిరెక్కిన మనసుకి కాసింత చైతన్యం కూడా దొరుకుతుంది.


4. ఒంటరితనానికి చెక్!

బతకాలని లేదు అన్న భావన కలిగినప్పుడు.. వెంటనే ఒంటరితనాన్ని వీడండి. మీ పరిస్థితి తెలిసి, మిమ్మల్ని అర్థం చేసుకునే తత్త్వం కలిగిన మీ శ్రేయోభిలాషుల్ని ఒకర్నో ఇద్దర్నో పిలిచి దగ్గర కూర్చోబెట్టుకోవడం బెటర్. పెంపుడు జంతువుతో స్పెండ్ చేయడం మరీ మంచిది. హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి.. కౌన్సిలింగ్ తీసుకుంటే ఇంకా ఉత్తమం.. అంటున్నారు థెరపిస్టులు.


5. పబ్లిక్ లోకెళ్ళండి!

మనసుకు బాధ కలిగినప్పుడు.. చనిపోదామన్న తీవ్ర నిర్ణయం తీసుకుంటానేమో అనే సందేహం కలిగినప్పుడు.. వెంటనే సమూహంలో కలిసిపోండి. స్నేహితులు, కుటుంబీకులు అందుబాటులో లేకపోతే.. ఫోన్లో ఎవ్వరూ దొరక్కపోతే.. వెంటనే బైటికెళ్లి ఏ గార్డెన్‌కో, పార్కుకో చేరుకొని అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం మంచిది. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి దిగితే ఇంకా మేలు.


6. ప్రేరణకు లొంగకండి!

చనిపోదామన్న ఆలోచన పుట్టగానే.. మనసు అటువైపే లాగెయ్యడం సహజం. పాజిటివ్ థింకింగ్ అనేది పూర్తిగా చచ్చిపోతుంది. ప్రతి అంశంలోనుంచీ నెగెటివ్ ఫీలింగ్‌నే తీసుకోవాలనిపిస్తుంది. ఇటువంటి సమయంలో మనల్ని మనం సానుకూల దృక్పథం వైపు నడిపించుకోక తప్పదు. మనం రాసుకున్న పాత డైరీని తిరగెయ్యడం లాంటి చర్యల ద్వారా.. మన గత స్మృతుల నుంచి స్ఫూర్తి పొందే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మన మెదడుని పాజిటివ్ థింకింగ్ వైపు నడిపించవచ్చట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *