‘మాకొకడున్నాడు.. దమ్ముంటే మీ తరపున ఒక్క పేరు చెప్పండి..’ అంటూ టీఆరెస్ శిబిరం నుంచి వస్తున్న సవాళ్లకు కూటమి నేతల దగ్గర ఎప్పుడూ సమాధానం లేదు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే అలవాటు తమ పార్టీకి లేదని చెప్పుకుంటూ ప్రచార కాలాన్ని దాటుకుంటూ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ.. తాము ఆశించినట్లు తెలంగాణాలో అధికారం ‘హస్త’గతమైతే.. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తప్పవన్న క్లారిటీ వాళ్లకూ లేకపోలేదు. ‘అప్పుడు చూసుకుందాం లే’ అనే ఎస్కెపిజం ఇప్పటికైతే వర్కవుటైంది. మరి.. ‘అప్పటి’ మాటేంటి?

ఓటర్ పల్స్ కాంగ్రెస్ వైపు ఉందన్న ఫీల్ కలిగిందో లేదో.. అప్పుడే టీ-కాంగ్రెస్ నేతల చేతులకు, నోళ్లకు దురద మొదలైంది. కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డాడన్న వార్తల్ని తమకు అనువుగా మార్చుకుంటూ బంగారు కలల్లో మునిగిపోతున్నారు కాంగీయులు. నిన్నటివరకూ స్తబ్దుగా వున్న కొంతమంది నేతలు.. ఇప్పుడిప్పుడే నోళ్ళకు పని చెప్పేస్తున్నారు. ‘దళితుడికి అవకాశం అంటూ వస్తే.. ఆ వరుసలో నేనే ముందుంటా..’ అంటూ సీఎం అభ్యర్థిత్వంపై తనకున్న ఆశను బైటపెట్టేశారు మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ. గతంలో వైఎస్ మృతి చెందిన సమయంలో ‘షార్ట్ లిస్ట్’లో తన పేరున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

మరోవైపు.. పార్టీలో రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమందికి కడుపుబ్బిపోతోంది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు.. రేవంత్ రెడ్డికి సీన్ పెరుగుతుండడంతో.. సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ”ఎప్పుడూ రెడ్లే ముఖ్యమంత్రులవుతారా.. బీసీలకు ఛాన్స్ ఇవ్వరా?” అంటూ గొంతెత్తి అరుస్తున్నారు సీనియర్ కాంగ్రెస్సేరియన్ హనుమన్న. ‘అయినా రేవంత్ సీఎం అవుతారని చెప్పడానికి ఆజాద్ ఎవ్వరు? సర్వే సత్యనారాయణకు హామీ ఇచ్చిందెవరు?” అంటూ రాగం తీస్తున్నారాయన. యువతకు పెద్ద పీటలేస్తానంటున్న రాహుల్ గాంధీ ‘ఓటు’ మాత్రం రేవంత్ రెడ్డికేనన్న ప్రచారం  మరోవైపునుంచి ముమ్మరంగా సాగుతోంది.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాజా మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, షబ్బీర్ అలీ లాంటి మరికొన్ని శాల్తీలు ఎన్నాళ్ళనుంచో ‘వెయిటింగ్ లిస్ట్’లో వున్నారు. ఇన్ని పేర్లను దాటుకొస్తే తప్ప కొత్త ముఖాలకు అవకాశం దక్కదు. ‘అసలే కూటమి.. ఆపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వం..! వీళ్ళ సినిమా భలే రంజుగా ఉండొచ్చ’న్న కామెంట్లు మరోవైపు. ”మా పార్టీలో ఒక్కడే సీఎం. కాంగ్రెస్ పార్టీలో 20 మంది ముఖ్యమంత్రులు” అని కేటీఆర్, హరీష్ రావు వేసిన పంచ్ డైలాగుల్ని వీళ్ళు నిజం చేస్తున్నారంటూ సెటైర్లు పడిపోతున్నాయి. పోలింగ్ తేదీకి ముందే ఇలా కర్చీఫులు పడిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ ‘రంగు’ బైటపడి ఓటర్లలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. 11 దాకానైనా హుందాగా మెలిగితే.. ఫలితం ఎటు తిరిగినా.. కనీసం గౌరవమైన దక్కొచ్చు.

ఇదంతా ఒక ఎత్తయితే.. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక ‘డార్క్ హార్స్’ని ప్రవేశపెట్టాలన్నది రాహుల్ గాంధీ మనసులో వున్న ప్లాన్B. ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి పేరు మీద అంతర్గతంగా పెద్ద చర్చే జరిగిందని, చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది. వివాద రహిత వ్యక్తిత్వం, మచ్చ లేని మనిషిగా ఆమెకున్న స్పెషాలిటీల్ని ఎక్స్‌పోజ్ చేస్తూ.. ఆమెకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా జరిగిందని, మరో ఇద్దరు నేతల్ని డిప్యూటీ సీఎంలుగా నియమించాలన్న సూచన కూడా వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *